మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ఎం. వి. వి. ఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయనతో పాటు వున్నల వెలువోలు బసవపున్నయ్య , వీరమాచినేని శివ ప్రసాద్, శ్రీ వి. బి ఆర్ చౌదరి (చిన్న) లు కుడా ప్రమాదంలో మృతిచెందారు. అమెరికా లో అలాస్క రాష్ట్రం లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వీరితో కారులో ప్రయాణిస్తున్న కడియాల వెంకటరత్నం (గాంధీ) తీవ్ర గాయాలతో అలాస్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరంతా శనివారం కాలిఫోర్నియా నుంచి బయలుదేరి అలాస్క చేరుకొని సరదాగా గడుపుతున్న సమయంలో ఘటన జరిగింది. అక్టోబర్ 6వ తేదీన కాలిఫోర్నియా లో జరగనున్న గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో డాక్టర్. మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది. ఇంతలోనే ఈ దుర్మరణం వార్త అందరిని కలచివేసింది. వీరు ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కుకు ఢికొనడంతో ఇద్దరు అక్కడిఅక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో మరణించారు.మూర్తి మృతితో గీతం వర్సిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గీతం వర్సిటీ ఉపాధ్యక్షుడు గంగాధరరావు వర్సిటీ అధినేత మూర్తి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు మూర్తి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుతున్నానన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా మూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యావేత్తగా, విద్యా దాతగా మూర్తి చెరగని ముద్ర వేశారన్నారు.మూర్తి మరణం పార్టీకి, విశాఖ ప్రజలకు, వ్యక్తిగతంగా నాకు తీరని లోటన్నారు. రోడ్డు ప్రమాదాల్లోనే అనేక మంది టీడీపీ నేతలను కోల్పోవడం కలచివేస్తోందన్నారు.
ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఏపీ అసెంబ్లి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ మూర్తి మరణవార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి, కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలిపారు. అలాగే ఎంపీ సాంబశివరావు, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న, ధూళిపాళ్ల నరేంద్ర, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ ప్రసాద్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ జయరామిరెడ్డి లు మూర్తి మృతి పట్ల సంతాపం తెలిపారు.