సర్గ-46
సప్త మరుత్తుల జననం
"తన గర్భం ఇలా ఏడు తునకలై పోవడంతో, దానికి కారకుడైన అజేయుడు-ఇంద్రుడిని చూసి, అతడిని ఓదార్చింది దితి. దోషం ఇంద్రుడిది కాదని, తనదని-తనది కాబట్టే ఇంద్రుడు గర్భాన్ని ఏడు తునకలు చేయగలిగాడని, ఎలాగూ పిండం ఏడు తునకలైనందున కోపం వదిలి ఇంద్రుడు, ఆ ఏడుగురు మరుత్తులు పాలించే ప్రదేశాలలో వారి పాలన ప్రజా రంజకంగా వుండేట్లు చేయమని ఇంద్రుడిని కోరింది దితి. తన ఏడుగురు కొడుకులను దేవతల ఆకారాలు ధరించేట్లు చేసి, అతని ద్వారా వారు ’మారుతులు’ అనే ప్రఖ్యాత పేర్లతో పిలవబడి-వాయు స్వరూపులై, ఆకాశంలో నివసించే వీలు కలిగించమని అడుగుతుంది. ఏడుగురిలో ఒకరు బ్రహ్మ లోకంలోను, ఒకరు ఇంద్రలోకంలోను, మరొకరు ఆకాశంలోను, తక్కిన నలుగురు ఇంద్రుడి ఆజ్ఞానుసారం నలుదిక్కుల్లోను వుంటారని చెప్తుంది దితి. తల్లి కోరిక నెరవేరుతుందని, ఆమె చెప్పినట్లే జరుగుతుందని, ఇంద్రుడు చేతులు జోడించి దితి సంశయం తీరుస్తాడు. ఈ విధంగా తల్లీ-కొడుకుల మధ్య తపోవనంలో అంగీకారం కుదిరిన పిమ్మట, ఇద్దరు సంతోషంతో స్వర్గానికి పోయారు" అని తను ఈ విషయాన్ని పెద్దలు చెప్పగా విన్నానని విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరిస్తాడు.
("ఆవహుడు, ప్రవహుడు, సంవహుడు, ఉద్వహుడు, వివహుడు, పరివహుడు, వరావహుడు" అని సప్త మరుత్తులను పిలుస్తారు. వీరుండే స్కందాలను "మారుత స్కంథాలు" అని అంటారు. "ఆవహం" అంటే గాలి-ఆవహుడు అనేవాడు, మేఘాలలో-పిడుగుల్లో-వర్షంలో-ఆకాశంలో వూడిపడే కొరవుల్లో, తిరుగుతుంటాడు. "ప్రవాహం" అనే వాయువు సూర్య మండలంలో, "సంవహం" అనే వాయువు చంద్ర మండలంలో, "ఉద్వహం" అనే వాయువు నక్షత్ర మండలంలో, "వివహం" అనే వాయువు గ్రహ మండలంలో, "పరివహం" అనే వాయువు సప్తర్షి మండలం-స్వర్గం-భూమి లో, "వరావహం" అనే వాయవు ధృవ మండలంలో చరిస్తుంటాయి. "గగనం, స్పర్శనం, వాయువు, అనిలుడు, ప్రాణం, ప్రాణేశ్వరుడు, జీవుడు" అని సప్త మారుతులకు పేర్లున్నాయి).
విశాల దేశ వృత్తాంతాన్ని శ్రీరాముడికి తెలిపిన విశ్వామిత్రుడు
"పూర్వం ఇంద్రుడు దితికి సేవ చేసిన దేశం ఇదే. ఇక్కడే, ఇక్ష్వాకుడు అనే రాజు, అలంబుస అనే భార్యవల్ల, మిక్కిలి ధర్మాత్ముడని కీర్తిగాంచిన విశాలుడనే వాడిని కన్నాడు. అతడే తన పేరుమీద విశాల అనే ఈ నగరాన్ని కట్టించాడు. విశాలుడి కుమారుడు హేమచంద్రుడు-అతడి కొడుకు సుచంద్రుడు-అతడి కొడుకు ధూమ్రాశ్వుడు-అతడి కొడుకు సృంజయుడు-అతడి కుమారుడు సహదేవుడు-అతడి కుమారుడు కుశాశ్వుడు-అతడి కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుడి కుమారుడు శూరుడైన కాకుత్థ్సుడు. ప్రస్తుతం ఈ నగరాన్ని, కాకుత్థ్సుడి కొడుకైన సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇక్ష్వాకుడి దయవల్ల ఆ వంశంలో పుట్టిన రాజులందరూ పరిశుద్ధమైన మనస్సున్నవారే-ధర్మమంటే ప్రీతిగలవారే-దీర్ఘాయువుగలవారే". అని విశాల నగరం గురించి చెప్పిన విశ్వామిత్రుడు, ఆ రాత్రి ఆ నగరంలో వుండి, మర్నాడు తెల్లవారగానే లేచి, జనక రాజును చూసేందుకు పోదామని శ్రీరాముడితో అంటుండగానే, వీరొచ్చిన విషయం తెలుసుకున్న విశాల రాజు సుమతి వారి దగ్గరకొచ్చాడు. శాస్త్రోక్తంగా, అర్ఘ్యపాద్యాదులతో విశ్వామిత్రుడిని పూజించిన సుమతి, ఆయన తన దేశానికి రావడంవల్ల సామాన్యంగా లభించని ఆయన దర్శనం తనకు లభించిందని, తద్వారా తాను ధన్యుడనయ్యానని అంటాడు. (మహాత్ములెవరైనా తమ గ్రామానికి వచ్చినట్లు తెలిస్తే, గ్రామం లోని పెద్దలు, వారి దర్శనానికి వెళ్లాలని దీనివలన బోధపడుతుంది).
(సుమతి తండ్రి కకుత్థ్సుడు, శ్రీరాముడి తాత-సూర్య వంశపు రాజు కకుత్థ్సుడు ఒకరు కాదు. ఇద్దరు వేరే. సుమతి వంశం, భాగవతంలో-నవమ స్కంధంలో కూడా చెప్పబడింది. ఆ వంశ క్రమం ఇలా వుంది: మనువుకు ఇక్ష్వాకుడు-నృగుడు-శర్యాతి-దిష్టుడు-ధృష్ణుడు-కరూశకుడు-అరిష్యంతుడు-పృషధృడు-నభగుడు-కవి అనే పదిమంది కొడుకులు పుట్టారు. ఆ పదిమంది కొడుకుల్లోని దిష్టుడికి, నాభాగుడు-అతడికి హలందనుండు-అతడికి వత్స ప్రీతి-అతడికి బ్రాంశువు-అతడికి బ్రమితి-అతడికి ఖమిత్రుడు-అతడికి జాక్షుషుడు-అతడికి వివింశతి-అతడికి రంభుడు-అతడికి ఖనేత్రుడు-అతడికి గరంధనుడు-అతడికి నవిక్షిత్తు-అతడికి మరుత్తుడు-అతడికి దముడు-అతడికి రాజవర్థనుడు-అతడికి సుధృతి-అతడికి సౌధృతేయుడు-అతడికి గేవలుడు-అతడికి బంధుమంతుడు-అతడికి వేదవంతుడు-అతడికి బంధుడు-అతడికి తృణబిందుడు, అనే కొడుకులు వంశ క్రమంలో పుట్టారు. తృణబిందుడికి, అలంబనకు పుట్టిన కూతురు పేరు "ఇలబిల". ఈమెకు "విశ్రవసుడు" కి పుట్టినవాడే "కుబేరుడు". తృణబిందుడికి విశాలడు అనే కొడుకు కూడా కలిగాడు. అతడే వైశాలి అనే నగరాన్ని కట్టించాడని భాగవతంలో వుంది. వైశాలినే విశాలి అని రామాయణంలో చెప్పడం జరిగింది. ఆ విశాలి వంశంలోని సుమతినే శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు చూసింది. సుమతి కొడుకు జనమేజయుడు. తృణబిందుడి అనుగ్రహంవల్ల వైశాలి రాజులందరూ దీర్ఘాయుష్మంతులు-మహావీరులు-వీర్యవంతులు-అతి ధార్మికులు గా అయ్యారు).
రేపు తరువాయి భాగం..