పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేసినందుకు గానూ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అత్యున్నత పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుకున్నారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు భారతీయులకు ఎంతో గౌరవం. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత ప్రజలు కట్టుబడి ఉంటారు. వాతావరణం, విపత్తు అనేవి సంస్కృతికి సంబంధించిన అంశాలు. పర్యావరణం సంస్కృతిని ప్రతిబింబించకపోతే విపత్తులను నివారించలేం. నేను చెప్పే ‘సబ్ కా సాత్’లో ప్రకృతి కూడా ఒక భాగమే’ అని అన్నారు.అంతకుముందు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘వాతావరణ మార్పుల వల్ల మన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతోందని ప్రధాని మోదీ గుర్తించారు. విపత్తులను అరికట్టేందుకు ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఇతర నాయకులు కూడా ఈ ముప్పును గుర్తించారు. అయితే వారికి, మోదీకి తేడా ఏంటంటే.. ఈయన గుర్తించడమే కాకుండా వాటిపై చర్యలకు ముందుకొచ్చారు’ అని గుటెరస్ కొనియాడారు.వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణలో నిలకడైన ప్రగతిసాధన దిశగా గట్టి చర్యలు చేపట్టినందుకు గానూ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డును సెప్టెంబరు 26న గుటెరస్ ప్రకటించారు. ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కూ నాయకత్వ కేటగిరీలో ఐరాస ఈ పురస్కారాన్ని ప్రకటించింది.