అమెరికా సైన్యం మద్దతు లేకుండా సౌదీ అరేబియా రాజు రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ రాజు సల్మాన్‌ను హెచ్చరించారు.‘సౌదీ అరేబియాకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తోంది. వాళ్లు సంపన్నులని మీరు చెప్పొచ్చు. నాకు కూడా రాజు సల్మాన్ అంటే ఇష్టం. కానీ నేను రాజుతో ఇలా చెప్పాను.. మేము మీకు రక్షణ కల్పిస్తున్నాం.. మేము లేకుండా మీరు రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరు.. సైన్యానికి మీరు డబ్బు చెల్లించాల్సిందే’ అని ట్రంప్ మిసిసిప్పిలోని సౌతవెన్‌లో జరిగిన ర్యాలీ పేర్కొన్నారు.అయితే ట్రంప్ యంత్రాంగం సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలు నెరుపుతోంది. ఆ ప్రాంతంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేసేందుకు అమెరికాకు సౌదీ ఎంతో ఉపయోగపడుతోంది. గత ఏడాది ట్రంప్ తన తొలి అంతర్జాతీయ పర్యటనకు కూడా సౌదీ అరేబియాకే వెళ్లారు. శనివారం సౌదీ రాజు సల్మాన్, ట్రంప్ సమావేశమయ్యారు. ట్రంప్‌తో ఆయిల్ మార్కెట్ స్థిరత్వం, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లు సౌదీ వెల్లడించింది. అయితే ప్రపంచంలో చమురును అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం సౌదీనే. ఒపెక్‌కు అధినేత. కాగా ఇటీవల ముడి చమురు ధరలు అధికంగా పెరుగుతుండడంపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరలను ఆపాలని, ధరలు తగ్గించాలని ట్రంప్ ఇటీవల ఐరాస సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే రక్షణ రంగానికి మరింత బడ్జెట్ కేటాయించాలని అమెరికా మిత్రపక్షాలైన జపాన్, దక్షిణ కొరియా, జర్మనీలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు.