2018 రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ హెచ్ ఆర్నాల్డ్, జార్జ్ పి.స్మిత్, బ్రిటన్ కు చెందిన పి.వింటర్ లు సంయుక్తంగా ఈ ఏడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ అవార్డు కింద లభించే రూ.7.32 కోట్లలో ఆర్నాల్డ్ కు సగం, మిగతా ఇద్దరికి మిగిలిన మొత్తం దక్కనుంది. ఈ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ సభ్యులు ప్రకటించారు. ఫ్రాన్సెస్ హెచ్ ఆర్నాల్డ్ 1993లో ఎంజైమ్ ల మీద పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ఉత్ప్రేరకాలను ఆమె అభివృద్ధి చేశారు. దీనివల్ల రసాయనిక చర్యలు వేగవంతమవుతాయి. తద్వారా ఇంధనాన్ని, మందులను తొందరగా తయారు చేయవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాలు ఆర్నాల్డ్ పరిశోధనపై ఆధారపడి ముందుకు వెళుతున్నాయిఇక స్మిత్, వింటర్ లు 1985లో ఫేజ్ డిస్ ప్లే అనే విధానాన్ని అభివృద్ధి చేశారు. బ్యాక్టీరియోఫేజ్ అని కూడా పిలిచే ఈ విధానం కింద ఓ బ్యాక్టీరియాపై వైరస్ ను ప్రయోగిస్తారు. ఈ క్రమంలో కొత్త ప్రొటీన్లను తయారుచేయవచ్చని స్మిత్, వింటర్ లు కనుగొన్నారు. ఈ పరిశోధన ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా పలు యాంటి-బయోటిక్ మందులను తయారుచేస్తున్నారు. అలాగే రోగాలకు కొత్తమందులను కనిబెడుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాసిస్, కేన్సర్ వంటి చాలా రోగాలకు మందులను కనిబెట్టడంలో ఈ పద్ధతి కీలకంగా మారింది.