ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసిందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలోప్రస్తుతం ఉన్న 7500 ప్రభుత్వాసుపత్రులను ఎలక్ట్రానిక్ ఆస్పత్రులకుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇకపై అన్ని ఆసుపత్రులలోనూ, ఆరోగ్య ఉపకేంద్రాలలోనూ రోగులకు సంబంధించిన హెల్త్ రికార్డులను, హెల్త్ కార్డులను, ఈ- హెల్త్ రికార్డులుగా భద్రపరచనున్నారు.వీటితో పాటు ఆయా వైద్య కేంద్రాలలో టెలీ మెడిసిన్ సెంటర్లును ఏర్పాటు చేయనున్నారు. వైద్యారోగ్య రంగంలో ఈ తరహా ప్రయోగం ప్రపంచంలోనే మొదటిగా వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 1147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 192 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 31 ఏరియా అసుపత్రులు, 13 జిల్లా అసుపత్రులు, 23 బోధనా అసుపత్రులు ఇకపై ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లుగా రూపాంతరం చెందనున్నాయి. వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ లీడర్ జార్జ్ కొరసా, సీనియర్ ఆపరేషన్స్ అధికారి, హార్ట్ హెల్త్ స్పెషలిస్టు మోహిని కక్ తదితరులతో కూడిన ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబును కలిసి ఈ అంశాలపై చర్చించారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆరోగ్యశాఖ సలహాదారు డాక్టర్ జితేందర్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి గిరిజాశంకర్ తదితరులు ఈ కొత్త ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు వివరాలు తెలిపారు.ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే 7500 ఆసుపత్రుల్లో టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 65 ఆసుపత్రుల్లో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరంభించిన ఈ సేవలకు అపూర్వమైన ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో ఉన్న సమస్యలను అధిగమించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులనుండి సహకారం అందించడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఐటీ ఆధారిత నైపుణ్యానికి సమర్థంగా ఉపయోగించుకుంటూ వైద్యారోగ్య రంగంలో తాము ఎటువంటి ప్రగతి సాధించింది ముఖ్యమంత్రికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వివరించారు. ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ప్రపంచ దేశాల్లో వున్న అత్యుత్తమ విధానాలను తమకు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.