YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనుచరులకు జగన్ మరో షాక్

అనుచరులకు జగన్ మరో షాక్
ఎన్నిక‌ల‌కు ఇంకా కొద్ది నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వేడి మ‌రింత పెరిగింది. రాజ‌కీయ పార్టీల‌న్నీ అధికారాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంతో పాటు, అభ్య‌ర్ధుల ఎంపిక‌పై కూడా పార్టీల‌న్నీ దృష్టి సారించాయి. వీటిలో ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్.. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు, గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానలను ఈ సారి ఎలాగైనా గెలుచుకోవాలని అనుకుంటున్నాడు. జనసేన రూపంలో వైసీపీకి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జగన్ స్పీడు పెంచాడు. అందుకోసం, సంవత్సరం నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నాడు. దీనితో పాటు కొన్ని స్థానాలపై కన్నేసిన వైసీపీ అధినేత ఆయా స్థానాలకు గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో సమన్వయకర్తలను కూడా నియమించాడు. అలాగే ప్రస్తుతం చేస్తున్న పాదయాత్రలో 2019 ఎన్నికలకు గానూ ఇప్పటికే పలువురు అభ్యర్ధులను ప్రకటించిన జగన్.. తాజాగా మరో అభ్యర్ధిని పేరు వెల్లడించాడు. ఈ పరిణామం వైసీపీలో లుకలుకలకు కారణమయింది.విజయనగరంలో జరుగుతున్న పాదయాత్రలో అక్కడి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కోల‌గ‌ట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తార‌ని వచ్చే ఎన్నికల్లో తనను, ఆయనను దీవించాలని జగన్‌ బహిరంగ సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో కోలగట్ల వర్గంలో హర్షాతి రేకాలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ స్ధానం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్ధి మీసాల గీత 15 వేల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఓడిపోయిన కోల‌గ‌ట్ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు జ‌గ‌న్‌. అంతేకాకుండా జిల్లా వైసీపీ అధ్య‌క్షుడుగా కూడా ఆయ‌న‌ను ఎంపిక చేశారు. మరోవైపు, అదే టికెట్ ఆశిస్తున్న వైసీపీ కీలక నేత బొత్సా సత్యనారాయణ, ఆయన అనుచరులైన అవనాపు బ్రదర్స్‌ జగన్‌ ప్రకటనతో షాక్‌కు గురయ్యారు. విజయనగరంలో వైసీపీకి జై కొట్టిన వ్యక్తి తండ్రి అవనాపు సూరిబాబు. ఆయన మరణాంతరం కూడా విక్రమ్‌, విజయ్‌ పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు కోలగట్లకు టికెట్ కేటాయించడంతో వారితో పాటు బొత్సా కూడా నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.

Related Posts