ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి తిరుపతిని వేదిక చెయ్యాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం జిల్లాలో ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి కి అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం నాడు అయన తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో చిత్తూరు,నెల్లూరు జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఇటీవల చైనా లో వారం రోజులు పర్యటించాను. చైనా వెళ్లక ముందు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మనం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం అని అనుకున్నాను. కానీ మనం చెయ్యాల్సింది ఎంతో ఉంది అని చైనా వెళ్లిన తరువాత అర్థం అయ్యిందని అన్నారు. చైనా లో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కి ఆ దేశం కల్పించిన మౌలిక వసతులే ప్రధాన పాత్ర పోషించాయి. చైనాలో 8 లైన్ల రోడ్ల తో మొదలు పెట్టి డిమాండ్ కి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పన జరుగుతుంది. షేన్జెన్ 40 ఏళ్లలో అభివృద్ధి చెందింది. మొదట్లో నేను 100 కంపెనీలు తీసుకురావాలి అని టార్గెట్ గా పెట్టుకున్నానని వివరించారు. చైనా పర్యటన తరువాత కనీసం 1000 కంపెనీలను తీసుకురాగలం అన్న ధీమా వచ్చింది. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మనకు పెద్దగా పోటీ లేదు. ఒక్క నోయిడా కి మాత్రమే కొన్ని కంపెనీలు వెళ్లాయి.అది కూడా ఒక్క సాంసంగ్ కంపెనీ తప్ప చెప్పుకోదగ్గ కంపెనీలు ఏమి లేవని అన్నారు. మన రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద మొబైల్ తయారీ కంపెనీలు,కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఫాక్స్ కాన్,షియోమి,సెల్ కాన్,డిక్సన్,కార్బన్ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. రిలయన్స్ జియో,హొలీ టెక్, ఫ్లెక్స్ ట్రానిక్స్,ప్రపంచంలోనే రెండోవ అతి పెద్ద టివి తయారీ కంపెనీ టిసిఎల్ కూడా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించబోతుందని అన్నారు. చైనా పర్యటన తరువాత ముఖ్యమంత్రిని కలిసి పర్యటన వివరాలు తెలియజేసాం.వచ్చే కంపెనీలకు కావాల్సిన మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి,భూమి సిద్ధంగా ఉందా,అర్బన్ ప్లానింగ్ రెడీ గా ఉందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారని అన్నారు. 2040 నాటికి మన దేశంలో 6 లక్షల కోట్ల రూపాయిల విలువైన ఎలక్ట్రానిక్స్ వినియోగించబోతున్నారు అనే అంచనా ఉంది. అందులో కనీసం 50 శాతం, 3 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఏపీ లో తయారు అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. లాక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారుల సహకారం కావాలి. ఆంధ్రప్రదేశ్ కి వచ్చే కంపెనీలు ఇబ్బంది పడకుండా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించాలి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం లో ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. చైనా కంపెనీలు మొదటిసారి దేశం దాటి ఆంధ్రా కి వస్తున్నాయని లోకేష్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కి ప్రత్యేకంగా 25 మంది తో ప్రమోషన్స్ టీం కూడా ఏర్పాటు చేస్తున్నాం. షేన్జెన్,యూరోప్,తైవాన్ దేశాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రత్యేక డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నాం. కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్,డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్,మెడికల్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్న కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసాం. డిజైన్ టూ డెత్ అనే మోడల్ లో చిప్ డిజైన్ దగ్గర నుండి ఈ వేస్ట్ మ్యానేజ్మెంట్ వరకూ ఆంధ్రా లోనే జరిగేలా కార్యాచరణ సిద్ధం చేసాం. నెల్లూరు,చిత్తూరు జిల్లాలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న భూములు గుర్తించడం,రోడ్లు,నీరు,విద్యుత్ ఇతర మౌలిక వసతుల కల్పన పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వాక్ టూ వర్క్ అనే మోడల్ సిద్ధం చెయ్యాలి...కంపెనీలకు సమావేశంలో ఇళ్ల నిర్మాణం, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సిద్ధం చెయ్యాలి. రాబోయే 20 సంవత్సరాలను దృష్టి లో పెట్టుకొని అర్బన్ ప్లానింగ్ చెయ్యండని అధికారులకు సూచించారు.