- వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వాహించిన సీఎస్ జోషి
ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీ, మహిళా సంక్షేమం, విద్యాశాఖ, ఇంధనం, గృహనిర్మాణం, రవాణా, మున్సిపల్, పంచాయతీరాజ్, పర్యాటక శాఖ, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, కార్మికశాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో అర్హత ఉన్న ప్రతి విద్యార్ధికి అడ్మిషన్ అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు హాస్టళ్ళు, కళాశాలలు, పాఠశాలకు గ్రేడింగ్ ఇచ్చేవిధానాన్ని రూపొందించాలని సి.యస్ పేర్కొన్నారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న స్వయం ఉపాధి పథకాలు శిక్షణా కార్యక్రమాలు, విద్యాసౌకర్యాలు,విదేశీ విద్యా పథకం తదితర అంశాలపై చర్చించారు. గిరిజన సహకార సంస్ధ ద్వారా ఆర్ధిక కార్యకలాపాలను మరింత విస్తృతపరచాలని సూచించారు. ఎస్సి,ఎస్టీ డెవలప్ మెంట్ ఫండ్ నిధుల వ్యయాన్ని పెంచాలన్నారు. వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్ధులు ఉన్నత విద్యాసంస్ధలలో మరిన్ని సీట్లు పొందేలా చూడాలన్నారు. స్టడీ సర్కిళ్ళ ద్వారా ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీ యువత ఉద్యోగ అవకాశాలు పొందేలా శిక్షణా కార్యక్రమాలు ఉండాలన్నారు. భూపంపణీ పథకం ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల భూములను పరిశీలించి వ్యవసాయం చేసేలా సహకారం అందించాలన్నారు. ఉన్నతాధికారులు క్షేత్ర స్ధాయిలో తనిఖీలు నిర్వహించి పనితీరు మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యాశాఖకు సంబంధించి సమీక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, సాంకేతిక విద్యాకళాశాలలో అడ్మిషన్లు, ఉత్తీర్ణత, ఉపాధిశిక్షణ, పరిశోధన, యస్ .యస్. ఎ, ఆర్.యం.యస్.ఎ నిధుల వినియోగం మధ్యాహ్నభోజన పథకం తదితర అంశాలపై సమీక్షించారు. నాణ్యమైన భోజన వసతిని కల్పించాలన్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు, వివిధ సెట్ల నిర్వహణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నందున పీక్ డిమాండ్ 9460 మెగా వాట్లకు చేరుకుందని, గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం డిమాండ్ పెరిగిందని అధికారులు సి.యస్ కు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్ధను 17000 మెగా వాట్ల డిమాండ్ ను తట్లుకునేలా పటిష్ఠ పరచాలన్నారు. ఈ వేసవి సీజన్ లో పీక్ డిమాండ్ 11 వేల మెగా వాట్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సి.యస్ అధికారులకు సూచించారు. 2014 లో రాష్ట్రంలో స్ధాపిత సామర్ధ్యం 7,778 మెగా వాట్లు ఉంటే నేడు 15,210 మెగా వాట్ల కు చేరుకున్నదని 9780 మెగా వాట్లు ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వివరించారు. సోలార్ ద్వార 3100 మెగా వాట్ల విద్యుత్ గ్రిడ్ కు కనెక్ట్ చేశామన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలో 1,73,406 గృహాలకు టెండర్లు ఫైనలైజ్ కాగా 1,38,795 గృహాలు గ్రౌండ్ కాగా 58,24 గృహాలు పూర్తి అయినట్లు సి.యస్ తెలిపారు. టెండర్లు పూర్తి అయిన గృహాలన్ని పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కోరారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు సౌభాగ్యపథకం ద్వారా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి జాతీయ రహదారుల భూసేకరణను వేగవంతం చేయాలని సి.యస్ సూచించారు. రోడ్లు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లపై బ్లాక్ స్పాట్స్, బ్లైండ్ కర్వ్ లను సరిచేయడంతో పాటు తగు సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టరేట్లు, ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో 7,440 కోట్లతో 5150 కిలో మీటర్ల సింగిల్ లేన్ ను డబుల్ లేన్ లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి 2890 కిలో మీటర్లు పూర్తి చేశామన్నారు. మండలాలనుండి జిల్లా హెడ్ క్వాటర్లకు డబుల్ లేన్ కు సంబంధించి 950కిలో మీటర్లు పూర్తి చేశామని, 163 బిడ్జికమ్ చెక్ డ్యాంలు 5300కిలో మీటర్ల మేర రోడ్లకు రెనివల్స్ చేశామని అధికారులు సి.యస్ కు వివరించారు
పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి వాటర్ షెడ్ పథకాల ద్వారా ఫలితాలను స్టడీ చేయాలన్నారు. PMGSY, DDUKGY, MNREGS, Rurban, నీరాంచల్, PMKSY, స్వచ్ఛభారత్ మిషన్ తదితర అంశాలపై చర్చించారు. వడ్డీలేని రుణాలు, అభయహస్తం, భీమా యోజనపథకాలపై సమీక్షించారు.
మున్సిపల్ శాఖకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ స్మార్ట సిటీస్, అమృత్,మెప్మా, హెచ్ఎండిఏ,జిహెచ్ఎంసి లపై సమీక్షిస్తూ, మెట్రోవాటర్ వర్క్స్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్ లైన్ బిల్డింగ్ పర్మిషన్స్, ఎస్ ఆర్ డి పి మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేషన్ లపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. అర్బన్ లోకల్ బాడీల పని తీరుపై ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ ను తీసుకోవాలన్నారు.పర్యాటక శాఖకు సంబంధించి డ్రాఫ్ పాలసీలు రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీ అజయ్ మిశ్రా, శ్రీమతి చిత్రా రామచంద్రన్, ముఖ్యకార్యదర్శులు శ్రీ సునీల్ శర్మ, శ్రీ వికాస్ రాజ్, టి.యస్. ట్రాన్స్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రభాకర్ రావు, కార్యదర్శులు శ్రీ నవీన్ మిత్తల్, శ్రీ బి.వెంకటేశం, శ్రీ బెన్ హర్ మహేశ్ దత్ ఎక్కా, శ్రీ జగధీశ్వర్, శ్రీమతి అనితారాజేంద్ర, శ్రీ దానకిషోర్, శ్రీ చిరంజీవులు, శ్రీ జ్యోతి బుద్ధప్రకాశ్ లతో పాటు శ్రీ అశోక్, శ్రీ కిషన్, శ్రీమతి నీతూ ప్రసాద్, క్రిస్టినా చౌంగ్త్, శ్రీ ప్రవీణ్ కుమార్, పౌసమీబసు, శ్రీ రఘుమారెడ్డి, శ్రీ రమణారావు, శ్రీ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.