రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడకు రూ.30కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నగరంలోని రోడ్ల అభివృద్ధి కోసం రూ.20కోట్లు, చెత్త తరలింపు కోసం రూ.10కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నగరాభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపి నిధుల కేటాయింపు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు, ట్రాఫిక్ రద్దీతో ధ్వంసమైన రోడ్లతో ఇబ్బందులెదుర్కొంటున్న నగర వాసుల సౌకర్యార్థం ఈనిధులను విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే లక్షల టన్నుల నిల్వ ఉన్న చెత్తను బయోమైనింగ్ ద్వారా ప్రోసెసింగ్ చేసి తరలించే ప్రక్రియ నిర్వహణకు రూ.10కోట్లను కేటాయించడం హర్షణీయమని శ్రీ్ధర్ తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటున్న విజయవాడ నగరంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించి ఎంతో అభివృద్ధిపర్చుతున్న నేపథ్యంతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించడం శోచనీయమని, తెలంగాణ సీఎంగా కేసీఆర్ తెలంగాణకు గానీ, రాజధాని హైదరాబాద్‌కు గానీ చేసిందేమి లేదని, రాజధాని హైదరాబాద్‌లో సకల సౌకర్యాలను అనుభవిస్తున్న కేసీఆర్ దాని అభివృద్ధి అంతా ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు చేసిందేనన్న విషయాన్ని మరవకూడదని, చంద్రబాబు చేసిన అభివృద్ధిని కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ప్రసంశించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.