సీఐసీఐ బ్యాంకు సీఈవో పదవికి చందా కొచ్చర్ రాజీనామా చేశారు. వీడియోకాన్ వివాదం కారణంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఆమె ముందుగానే రిటైర్ అయ్యారు. ముందుగానే పదవి నుంచి తప్పుకుంటానని ఆమె కోరగా.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంగీకారం తెలిపారు. కొచ్చర్ స్థానంలో ఎండీ, సీఈవోగా సందీప్ భక్షి బాధ్యతలు చేపడతారని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం భక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. భక్షి ఐదేళ్లపాటు అంటే.. 2023 అక్టోబర్ 3 వరకు పదవిలో కొనసాగుతారని ఐసీఐసీ బ్యాంక్ తెలిపింది. వీడియోకాన్ గ్రూప్‌కి నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేశారని చందా కొచ్చర్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ప్రతిఫలంగా ఆ గ్రూప్ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ సంస్థకు పెట్టుబడులు సమకూర్చారనేది ప్రధాన ఆరోపణ. భర్త వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదంటూ చందా కొచ్చర్ వాదించారు. ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఆమెకు బాసటగా నిలిచింది. పదవి నుంచి తప్పించకుండానే దీర్ఘకాలిక సెలవులో వెళ్లడానికి అంగీకారం తెలిపింది. సెబీతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో దర్యాప్తు చేపట్టాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా అంతర్గత విచారణ ప్రారంభించింది.ఈ పరిణామాల నేపథ్యంలో జూన్ 19న భక్షి సీఓఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ కేంద్రంలోని పనులు, వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు.