శ్రీవారి కోరిక మేరకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే తిరుమలలో ఉత్సవాలు నిర్వహించాడని, నాటి నుంచి ఇవి బ్రహ్మోత్సవాలుగా పిలవబడుతున్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏటా కన్యామాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.అధిక మాసంలో తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలను రెండుసార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చాంద్రమానం ప్రకారం మూడేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అధికమాసం కావడంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇప్పటికే నిర్వహించారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుంచి జరుగనున్నాయి. అయితే, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం మాత్రం ఉండవు. అక్టోబరు 9న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరుగుతుంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులు వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి, యాగశాలలో ఆగమోక్తంగా క్రతువు నిర్వహిస్తారు. మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గురడ వాహనసేవ అక్టోబరు 14న జరుగుతుంది. అలాగే 15న పుష్పకవిమానం, 17న స్వర్ణరథోత్సవం, 18న చక్రస్నానం జరుగనున్నాయి. ఈ తొమ్మిది రోజులూ ఉదయం వాహనసేవ 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలకే విశేష ప్రాధాన్యత ఉంది. తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. చక్రస్నానంలో భాగంగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.