కర్ణాటకలో కేబినెట్ విస్తరణకు వెళయ్యింది. కొద్దిరోజులుగా విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఈ నెల 10 తర్వాత ముహుర్తం ఖాయమయ్యిందనే ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా కాకముందే.. విస్తరణకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి కుమార స్వామి. మరి మంత్రివర్గంలో ఎవరిపై వేటు పడుతుంది.. ఎవరికి కొత్తగా అవకాశం దక్కబోతోందన్నది ఆసక్తిగా మారింది. విస్తరణ జరిగితే.. కేబినెట్‌లో ఇద్దరికి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి నుంచి తప్పించి.. కొత్తగా సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కుమార స్వామి భావిస్తున్నారట. అటవీశాఖ మంత్రి శంకర్‌కు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే బీసీ సంక్షేమశాఖ మంత్రి పుట్టరంగశెట్టిపైనా వేటు పడబోతోందట. వీరిద్దరిని కేబినెట్ నుంచి తప్పించి.. బోర్డులకు ఛైర్మన్‌లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. శంకర్ స్థానంలో కుండగోల్ నుంచి గెలిచిన శివల్లిని కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్సులు ఉన్నాయట. రంగశెట్టి స్థానంలో ఎవర్ని భర్తీ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఈసారి కేబినెట్ విస్తరణ విషయానికొస్తే.. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు 22.. జేడీఎస్ 12 పదవుల కింద విభజించారు. మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు ఆరు.. జేడీఎస్‌కు మరో ఖాళీ ఉంది. ఇప్పుడు ఇద్దరిపై వేటు పడితే.. విస్తరణలో కేబినెట్‌లోకి 5 గురిని తీసుకునే అవకాశం ముందట. మిగిలిన రెండు పదవుల్ని ఖాళీగానే ఉండబోతున్నాయట. ఇదిలా ఉంటే.. కేబినెట్ విస్తరణ వార్తలతో కాంగ్రెస్‌లో కూడా ఆశవహుల సంఖ్య పెరిగింది. కాని పదవులు మాత్రం తక్కువగా ఉన్నాయి. దీంతో బోర్డులు, కార్పొరేషన్ పదవులు ఇచ్చి కొందర్ని బుజ్జగించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ పదవుల పందేరానికి సంబంధించి ఇప్పటికే ఓ జాబితాను కూడా తయారు చేశారట. కేబినెట్ విస్తరణ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలను వివిధ బోర్డులు, కార్పొరషన్ పదవుల్ని కట్టబెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.