బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఒంటరిగా పోటీ చేయడం కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని ఇటీవల మాయావతి స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించింది కానీ సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మాయావతి పొత్తుకు అంగీకరించలేదు.‘మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పొత్తు అంశం మాపై పెద్దగా ప్రభావాన్ని చూపదు’ అని రాహుల్ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ అన్నారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం మంచిదని, ఈ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కేంద్రంలో, రాష్ట్రాల్లో పొత్తులు వేర్వేరు. మాయావతిజీ దాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో మాకు అనుకూలత ఉంది. మేం చర్చల్లో ఉండగానే వాళ్లు వాళ్ల దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు’ అని రాహుల్ వెల్లడించారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశముందని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ అవకాశం ఎక్కువగా ఉందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇతర పార్టీలతో పొత్తుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారని , ప్రయత్నాలను సఫలం కానివ్వట్లేదని మాయావతి ఆరోపించిన విషయం తెలిసిందే.