ప్రజలకు పథకాలు ప్రకటించి బుట్టలో వేసుకుంటాయి పార్టీలు. అవే స్కీములు. తమ మధ్యలోనూ అంతర్గత స్కీములుంటాయి. వాటిని పాచికలు లేదా పన్నాగాలు అని పిలుచుకోవాలి. తమ పైచేయి కోసం వేసే ఎత్తుగడలు అవి. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకూ వ్యూహాలుంటాయి. అవగాహన, అనధికార ఒప్పందం, మైత్రీపూర్వక పోటీ వంటివన్నీ రాజకీయ చదరంగంలో పావులే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న మంతనాలు, లోపాయికారీ సంభాషణలు, కదలికలు వంటివన్నీ గూడుపుఠాణి లనే తలపిస్తున్నాయి. ఎవరు ఎవరికి నిజమైన మిత్రులో, శత్రువులో తేల్చుకోలేనంతగా రాజకీయం అలుముకుంది. సీట్ల సర్దుబాట్లు,భవిష్యత్తు అధికార పంపిణీ సహా అన్నీ చర్చల్లో చోటు చేసుకుంటున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ రాజకీయ ప్రస్థానంలో ఎవరితో ఎవరు కలిసి నడుస్తున్నారో అంతుచిక్కని బ్రహ్మపదార్థంగా మారింది.అత్యంత బలహీనమైన స్థితిలో 2014లో చంద్రబాబునాయుడు పవన్ తో చేతులు కలిపారు. ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితాలు రావడానికి ముందు వరకూ టీడీపీలో స్థైర్యంలేదు. ప్రతిపక్షంలోనే కూర్చోవాలనే భావించారు. ఎన్నికలు జరిగిన తర్వాత కలిసిన చంద్రబాబు దాదాపు అదే విషయాన్ని తనతో చెప్పారంటూ కొత్త విషయాన్ని ఇటీవలనే వెల్లడించారు పవన్. ‘వైసీపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఇద్దరం కలిసి పనిచేయాలం’టూ చంద్రబాబు అభ్యర్థించారని పవన్ తెలిపారు. ఇది నిజమే. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు అలాంటివి. అయితే బాబు లెక్క తప్పింది. ఓటరు దేవుడు కరుణించాడు. అధికారంలోకి వచ్చారు. తొలిదశలో జనసేనతో మంచి సంబంధాలనే మెయింటెయిన్ చేశారు. టీడీపీతో కలిసి నడిస్తే జనసేనకు మనుగడ ఉండదు. తోకపార్టీగానే మిగిలిపోతుంది. ఈవిషయాన్నే పవన్ శ్రేయోభిలాషులు ఆయనకు నూరిపోశారు. దాంతో రూటు మార్చారు. ప్రత్యేక హోదా, ప్రభుత్వ అవినీతి వంటి అంశాలను లేవనెత్తాలని చూశారు. అయినప్పటికీ ప్రజలు విశ్వసించే పరిస్థితి కనిపించలేదు. నేరుగా లోకేశ్ అవినీతిపైనే ధ్వజమెత్తారు. వర్కవుట్ అయ్యింది. టీడీపీకి ప్రత్యర్థిగా ప్రజలు, తెలుగుదేశం కొంతవరకూ నమ్మడం మొదలుపెట్టాయి. తన అజెండాను తాను నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.తెలుగుదేశంతో ప్రయోగం ఒక రకంగా విఫలమైంది. మరోరకంగా అనుభవం నేర్పింది. రాజకీయాల్లో ముందస్తు బేరసారాలు లేకుండా బేషరతుగా ఎవరికీ మద్దతు ఇవ్వకూడదు. అందులోనూ రాజకీయాధికారంలో వాటా లేకపోతే మాట చెల్లదు. పవన్ విషయంలోనూ అదే జరిగింది. జనసేన పోటీ చేయలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ లో తమ సభ్యులు లేరు. పార్టీగా ఉనికి ఉన్నప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఒక శక్తిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అందుకే 2019 ఎన్నికల వ్యూహరచనలో చాలా తెలివిగా జనసేన అడుగులు వేస్తోంది. వివిధ మార్గాల్లో చేసుకున్న సర్వేల్లో జనసేనకున్న బలం తేటతెల్లమైంది. విడిగా పోటీచేస్తే కొన్ని చోట్ల తెలుగుదేశానికి, మరికొన్ని చోట్ల వైసీపీకి లబ్ధి చేకూరుతుందని తేలింది. ఒక పార్టీగా జనసేనకు కలిగే లాభం కంటే పోటీవల్ల తెలుగుదేశం, వైసీపీలకే ఎక్కువ ప్రయోజనమని స్పష్టమైంది. అందులోనూ తాను ఓట్లు చీల్చడం వల్ల వైసీపీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని సర్వేల్లో వెల్లడైంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల 28 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గరిష్టంగా లబ్ధి పొందుతుందని అంచనా వేశారు. ఒకవేళ జనసేన పోటీ లేకపోతే ఈనియోజకవర్గాల్లో మూడింట రెండువంతులు వైసీపీ ఖాతాలోకి మళ్లే అవకాశం ఉంది. ఈ సర్వే రిపోర్టులను వైసీపీ కూడా సేకరించింది. అప్పట్నుంచి జనసేనతో పొత్తు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండు పార్టీలు నష్టపోకుండా ఉండాలంటే ఏదో ఒక స్థాయిలో అవగాహన కుదుర్చుకోవాల్సిందేనని తీర్మానించుకున్నారు. దానికనుగుణంగా ఇరుపార్టీల్లోని అధినేతల శ్రేయోభిలాషులు గడచిన కొంతకాలంగా అనధికార మంతనాలు జరుపుతున్నారు.వైసీపీ, జనసేనల మధ్య ప్రత్యక్షంగా పొత్తు కుదిరే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. అధికారపార్టీ వైసీపీ,జనసేన, బీజేపీలను ఒకటి చేసి రాష్ట్రద్రోహులుగా మాట్టాడుతోంది. ఆ ఆరోపణను మరింతగా ప్రజల్లోకి తీసుకెళుతుంది. దానివల్ల రెండు పార్టీలు నష్టపోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కలిసి నడవకూడదని రెండుపార్టీల పెద్దలు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో తమ మధ్య పోటీ టీడీపీకి సహకరించకుండా చూసుకోవాలనే అంచనాకు వచ్చారు. వైసీపీ కంటే జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆపార్టీకే కొంతమేరకు అవకాశం కల్పించాలనేది ఒక అవగాహన. ఆయా నియోజకవర్గాల్లో బలహీనమైన క్యాండిడేట్లను వైసీపీ బరిలోకి దింపుతుంది. తద్వారా ఆ పార్టీ ఓట్లు కూడా జనసేన వైపు సంఘటితమయ్యేలా సహకరిస్తుంది. ఇటువంటి నియోజకవర్గాలపై ఇప్పటికే రెండు సర్వేలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రం మ్మొత్తమ్మీద 15 నియోజకవర్గాల్లో వైసీపీ కంటే జనసేనకు అధిక ఓట్లు లభిస్తాయని తేలింది. ఆ నియోజకవర్గాల్లో తాము సహకరిస్తామని వైసీపీ జనసేనకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే జనసేన లెక్కలు వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలోని 32 నియోజకవర్గాల్లో తాము వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలుగుతామని ఆ పార్టీ భావిస్తోంది. ఈ సీట్ల తకరారు తేలితే రెండు పార్టీలు పరోక్షంగా సహకరించుకునే అవకాశాలున్నాయనేది రాజకీయవర్గాల పరిశీలన.