అన్నాడీఎంకే బహిష‌్కృత నేత టీటీవీ దినకరన్ స్పీడ్ పెంచుతుండటంతో మరో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారా? పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నారా? అవును. అన్నాడీఎంకే వర్గాలు అంగీకరిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తున్న తరుణంలో దినకరన్ కొంత దూకుడుగా వెళుతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొందరితో ఇప్పటికే దినకరన్ టచ్ లో ఉన్నారు. ప్రభుత్వం కూలదోసేందుకు ఆయన సిద్ధమయినట్లు సమాచారం పక్కాగా ఉందంటున్నాయి అన్నాడీఎంకే శ్రేణులు.దినకరన్ వర్గంగా ముద్రపడిన 18 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అనర్హత వేటు అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు చెప్పడంతో, ఈ కేసును మూడో న్యాయమూర్తికి అప్పగించారు. త్వరలోనే ఈ తీర్పు వెలువడనుంది. న్యాయస్థానంలో ఎలా తీర్పు వచ్చినా పళనిస్వామి సర్కార్ కు ఇబ్బందులు తప్పవని గ్రహించి కొందరు ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి దగ్గరవుతున్నారు.ముఖ్యంగా ఇందులో తిరువాడానై నియోజకవర్గం నుంచి రెండాకుల గుర్తుపై గెలిచిన కరుణాన్ గత కొద్ది రోజుల నుంచి స్వరం మార్చారు. పళనిస్వామికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆయన శశికళను కూడా కలసినట్లు సమాచారం అందింది. కరుణాన్ తో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలైన రత్నసభాపతి, కలై సెల్వన్, ప్రభు లపై కూడా అనుమానాలున్నాయి. వీరంతా దినకరన్ కు వేగులుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో వీరి నలుగురిపై వేటు వేయాలని అన్నాడీఎంకే భావిస్తోంది. ఇప్పటికే వీరిపై పార్టీ నిబంధనలను అతిక్రమించారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ధన్ పాల్ కు అన్నాడీఎంకే లేఖ రాసింది. వీరికి త్వరలోనే స్పీకర్ నుంచి నోటీసులు అందనున్నట్లు సమాచారం. వీరిపై అనర్హత వేటు వేస్తే దినకరన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 22కు చేరుకుంటుంది. అయితే కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఈ చర్యకు దిగుతారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు.ఇక దినకరన్ పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను విడదీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి పళనిస్వామిని గద్దె దించేందుకు తనతో సహకరించాలని పన్నీర్ సెల్వం కోరారని దినకరన్ బాంబు పేల్చారు. పన్నీర్ సెల్వానికి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్న ఆశ ఉందని, ఆయన త్వరలోనే పళనిని గద్దె దించుతారని దినకరన్ చెప్పడం విశేషం. పన్నీర్ సెల్వం మనుషులు తన వద్దకు వచ్చిన మాట వాస్తవం అని అన్నారు. ఇలా ఒకవైపు ఎమ్మెల్యేలను ఆకట్టుకుంటూ, మరోవైపు మైండ్ గేమ్ ఆడుతూ దినకరన్ పళనికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.