ఒకప్పుడది ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం..జల సిరులతో.. కళకళలాడే పైర్లతో అలరారిన ప్రాంతం..కానీ నేడు పరిస్థితి పూర్తిగా భిన్నం.. కోనసీమ ఆకలిబాధతో అలమటిస్తోంది. రైతుల వలసలతో తల్లడిల్లుతోంది. పచ్చని పైర్లకు నెలవైన గోదావరి జిల్లాల్లో నెలకొన్న దుస్థితి. పిల్ల తెమ్మరల హోరుతో.. పచ్చని పైరుల సోయగాలతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న గోదావరి జిల్లాల్లోనూ జనం వలసబాట పట్టడం అత్యంత దయనీయం. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, జలసిరులతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు పనులు లేక కుదేలవుతున్నాయి. వ్యవసాయ రంగం కునారిల్లి.. దాని స్థానంలో ఆక్వారంగం విస్తరించడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు, కూలీలు ఊళ్లను విడిచిపెట్టి.. ఉపాధి వేటలో వలస బాట పడుతున్నారు.ఏటా రెండు పంటలు పండించే అన్నదాతలు, వ్యవసాయాన్నే నమ్ముకున్న కూలీలు పొట్ట చేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లడం పల్లెల దుర్భర పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. వ్యవసాయం తప్ప వేరే తెలియని సెంట్రల్ డెల్టాలోనూ పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచకీరణ పరిణామాలతో భూ యజమానులు పల్లె విడిచి పట్నం బాట పట్టడం, ఉన్న భూముల్ని కౌలుకిచ్చి వలస బాట పట్టడం సాధారణమైంది. కౌలు రైతులు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొనడం నిజంగా దారుణం. పంటలు వేసే సమయంలో సాగు వ్యయం పెరిగడం, పంట చేతికొచ్చాక కనీస గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రుణభారం పెరిగి వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.వ్యవసాయం సన్నగిల్లి పోయింది. పంట పొలాలన్నీ చేపల చెరువులుగా మారుతున్నాయి. ఆక్వారంగం విస్తరించడంతో పాటు విస్తృతమైన యాంత్రీకరణతో కూలీలకు సైతం ఉపాధి కరువై వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత భూస్వాములు పట్టణాల బాట పడితే.. తర్వాత కౌలుదారులు అదే బాటలో ఉపాధి కోసం పయనమవడం గోదావరి జిల్లాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితికి నిదర్శనం. అత్యధికులు వలస బాట పట్టడంతో.. గ్రామాల్లో ఎక్కడ చూసినా చిన్న పిల్లలు, వృద్ధులే కనిపిస్తున్నారు. ఉపాధి కోసం వలస బాట పడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రమాల్లోనే వదిలి వెళ్తున్నారు. ఊళ్లో ఉన్న అమ్మమ్మ, నానమ్మల దగ్గరే పిల్లల్ని ఉంచి, సర్కారీ బడుల్లో చదువుకునేలా చేస్తున్నారు. తల్లిదండ్రులు వలసలు పోవడంతో పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బంధాలు, బంధుత్వాలను వదిలిపెట్టి.. వలస బాట పట్టిన కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో ఉండటంతో పిల్లలు.. మానసిక వేదనకు గురై బేలగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల వలసలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు పిల్లలు ఊరొదిలి తల్లిదండ్రులతో పాటు వెళ్లడంతో పాఠశాలలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అయితపూడిలో రెండు స్కూళ్లను మూసేశారు. పాలమూరు, అనంతపురం జిల్లాల్లో వలసల గురించి విన్నాం గానీ గోదావరి జిల్లాల్లో వలస పోవడం ఇబ్బందుల తీవ్రతకు నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు, సబ్సిడీ ఎరువులు ఇవ్వడం ద్వారా వలసల్ని నివారించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశానికి పట్టు కొమ్మలైన పల్లెల దుస్థితిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లెల్లో వలసల్ని అరికట్టేందుకు పాలకులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు