YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందుకు సాగని బకింగ్ హాం కాలువ పనులు

 ముందుకు సాగని బకింగ్ హాం కాలువ పనులు
బ్రిటీష్ కాలంలో సముద్ర తీరం వెంట సమాంతరంగా నిర్మించిన బకింగ్‌హాం కాలువకు కాలదోషం పట్టింది. 1970నుంచి కాలక్రమేణా ఈ కాలువ కనుమరుగవుతూ వస్తోంది. రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర విస్తరించిన బకింగ్ హామ్ కెనాల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని చేసిన ప్రకటన ఆచరణలో మాత్రం కనిపించటం లేదు. బకింగ్ హాం కెనాల్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో పడ్డారు.ఏ దేశాభివృద్దికైనా రవాణా సౌలభ్యాలు కీలకం. ఈ రంగం సరళంగా ఉంటే అభివృద్దికి ఆకాశమే హద్దు. ఇందుకు అనుగుణంగా రోడ్డు, విమాన మార్గాలనే కాదు జల మార్గాలను కూడా మరింతగా వృద్ది చేసుకునేందుకు కృత నిశ్చయంతో ముందడుగు వేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా రాష్ట్ర పరిధిలోని చారిత్రక బకింగ్ హామ్ కాలువ పునరుద్దరణ చర్యలకు కేంద్రం ఏడాది క్రితం నిధులు విడుదల చేస్టున్నట్టు ఆర్భాటంగా ప్రకటించింది.కేంద్రం ప్రకటన అయితే చేసింది కానీ ఇంతవరకు అమలు ఊసే మరిచింది. ప్రకాశం జిల్లాలో 119కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కాలువ..కాకినాడనుంచి కృష్ణపట్నం వరకు 800 కిలోమీటర్లు పొడవు వుంటుంది. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ కాలువ అప్పట్లో మానవ, సరకు రవాణాకు ఉపయోగపడింది. ఆ ఆనవాలును అనుసరించి కేంద్రం పోర్టులకు సమాంతరంగా, ఇన్లాండ్ వాటర్ వేను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానంగా రాష్ట్రంలో అనువుగా ఉన్న గొలుసు కట్టు పోర్టుల విధానానికి ఈ ఇన్లాండ్ వాటర్ వే వెన్నుదన్నుగా మార్చాలని నిర్ణయించారు. 32 మీటర్లు వెడల్పు, 6 మీటర్లు లోతు,5:1వైశాల్యంతోపాటు గట్టు ఏర్పాటుతో నాలుగో జాతీయ జలమార్గంగా దీన్ని రూపొందిస్టున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖనుంచి ఓ బృందం వచ్చి కొత్తపట్నం బకింగ్ హాం కాలువను..ఇక్కడి పురాతన బ్రిడ్జిని సందర్శించింది. అయితే కేంద్రం పునరుద్దరణ ప్రకటన చేసిన అనతి కాలంలో జరిగిన హడావిడి చర్యలు నేడు కరువయ్యాయి. వేదికలెక్కి కమలనాధులు చేసిన బకింగ్ హామ్‌ ప్రాజెక్టు ఊసుకు రెక్కలు తెగిపోయాయి.ప్రస్తుతం బకింగ్ హాం కాలువ ఆక్రమణలు, పూడికలకు నెలవుగా వుంది. 1970 తర్వాత ఈ జలమార్గం అంతరించింది. ఇప్పటికీ నాటి బ్రిటీష్ సాంకేతిక పరిజ్ఙానానికి సాక్ష్యంగా ఈ కాలువ నిలిచింది. అనేక చోట్ల క్రేన్లు ఏర్పాటు చేయడంతో సముద్రానికి కేవలం కిలోమీటరు దూరంలో ఈ మార్గాన్ని అమర్చడంతో సునామీలు, వరదలు వంటివి జనజీవనాన్ని తాకకుండా రక్షణగానూ నిలిచింది. అయితే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలు కొలువు దీరడంతో పురాతన జలమార్గాలను మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ పాలన వంటి అంశాలతో ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ఈ బృహత్తర పథకాన్ని పట్టాలెక్కిస్తానని హామీ ఇచ్చింది.. ఇందులో భాగంగా తొలి విడతగా మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.జాతీయ జలరవాణా ద్వారా పోర్టులను కలుపుతూ అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల్లో కీలక భూమిక పోషించనుంది బకింగ్ హామ్‌. దీనికి తోడు బకింగ్ హామ్ కు ఇరువైపులా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వుండడంతో కోరమండల్ తీరమంతా ట్రాన్స్ పోర్ట్ కారిడార్ హబ్ గా రూపాంతరం చెందనుంది. ప్రధానంగా ప్రకాశం జిల్లానుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల అంచనా 20వేల కోట్ల రూపాయలు...ఇంతేకాకుండా గ్రానైట్ పరిశ్రమద్వారా లక్షల కోట్లలో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగుతోంది. అందుకే బకింగ్ హామ్‌ పునరుద్దణ ఆవశ్యాన్ని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గుర్తించాలి. ఈ విషయంలో చిత్తశుద్దితో వ్యవహరిస్తే నవ్యాంద్ర అభివృద్దిలో బకింగ్‌ హాం కీలకంగా మారుతుంది.

Related Posts