రాయలసీమ జిల్లాలకు వరప్రసాదిని అయిన తుంగభద్ర డ్యాం నీరు లేక వెలవెలబోతోంది. తుంగభద్ర డ్యాంలో నీరు ఉంటేనే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఏడాది డ్యాంలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో మూడు జిల్లాల్లోని 6.8 లక్షల ఎకరాల ఆయకట్టు సంక్షోభంలో పడిపోయింది. తుంగభద్ర డ్యాంకు ఈసారి 151 టిఎంసిల నీటి లభ్యత వస్తుందని డ్యాం బోర్డు అంచనా వేసింది. కానీ ఇప్పటి దాకా కేవలం 83 టిఎంసిల నీరు మాత్రమే చేరింది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 1633 అడుగులతో 100.8 టిఎంసిలు. ప్రస్తుతం 1614.9 అడుగులతో 45.67 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో దాదాపు 70 టిఎంసిల నీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం డ్యాంలోకి కేవలం 1824 టిఎంసిల నీరు మాత్రమే వస్తుంది. కాల్వలకు 8 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యాంలో ఏ మాత్రం నీరు చేరకపోవడంతో నది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒట్టిపోయింది. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ ఏడాదికి కనీసంగా సుంకేసుల డ్యాం వద్ద 100 టిఎంసిల దాకా నీటి లభ్యత ఉండేది. గతేడాది నుంచి సుంకేసుల వద్ద నీటి లభ్యత బాగా తగ్గిపోవడం కర్నూలు, కడప జిల్లాల రైతాంగాన్ని, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కెసి కెనాల్‌కు నీటి విడుదల సుంకుసుల నుంచే ఉన్నందున ఈ ప్రభావం కర్నూలు, కడప జిల్లాల్లో సాగు, తాగునీటిపై పడుతోంది. ఈ ఏడాది కేవలం 14.22 టిఎంసిల నీరు మాత్రమే ఉండడంతో ఖరీఫ్‌లోను
తుంగభద్ర నదిలో నీటి లభ్యత దారుణంగా పడిపోవ డంతో అనంతపురం, కడప జిల్లాల్లో హెచ్‌ఎల్‌సి కింద 2.68 లక్షల ఎకరాలు, కర్నూలు, కడప జిల్లాలోని కెసి కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లాలోని తుంగభద్ర దిగువ కాలువ కింద ఉండే 1.54 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు సంక్షోభంలో పడిపోయింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో ఈ ప్రాజెక్టుల కింద సాగైన పంటలు చేతికొచ్చేదాకా నీరిచ్చే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్టోబర్‌లోనే డ్యాంలో అతి తక్కువగా కేవలం 45 టిఎంసిల పరిమాణంలోనే నీరు ఉండడంతో రానున్న వేసవిలో తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదముందని రాయలసీమ జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.