ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ప్రజల సమస్యల్ని వాటి పరిష్కార మార్గాల్ని తెలుసుకున్నానన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానన్న జేడీ త్వరలోనే తన ప్రణాళిక తెలియ జేస్తామన్నారు. నా ఆలోచనలతో ఏకీభవించే వారితో కలిసి వెళ్తానన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలన్నారు జేడీ. ప్రజలు ఓటు కోసం డబ్బు తీసుకోకపోతేనే ఇది సాధ్యమవుతుందన్నారు. గ్రామీణాభివృ ద్ధిలో పనిచేయాలని అనుకున్నానన్న జేడీ, పోలీస్ శాఖకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.
శనివారం నాడు తిరుపతి లో మీడియా సమావేశంలో మాట్లాడిన లక్ష్మీ నారాయణ, రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి, యువత కోసం ఏడేళ్ల ఉద్యోగాన్ని వదులుకున్నానన్నారు. స్వామినాథన్ సిఫార్సుల అమలుతో రైతుల కష్టాలు చాలా వరకు తగ్గుతాయని తెలిపారు. ప్రభుత్వాలు ఎందుకు వీటిని పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. స్మార్ట్ సిటీలు కాదు, మొదట స్మార్ట్ విలేజ్లు అవసరమన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ది పథకాలు వచ్చి, ధరల స్థిరీకరణ జరగాలన్నారు. మండలానికి కాదు గ్రామానికో అధికారి ఉండాలని ప్రతిపాదించారు. ప్రతి జిల్లాకో వ్యవసాయ పాలసీ ఉండాలన్నారు. తామే సొంతగా జిల్లాల వారీగా పాలసీలు రూపొందించామని చెప్పుకొచ్చారు. తొలుత అనంతపురం జిల్లా పాలసీ విడుదల చేస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారంతో కూడిన పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించినట్లుగా తెలిపారు. చదువుకున్న యువత వ్యవసాయ రంగం వైపు మరలేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందున్నారు. ఏపీలో 13 జిల్లాల పర్యటనలో గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారాల వివరాలతో ఓ నివేదికను తయారుచేసి సీఎంకు అందచేస్తామన్నారు.