YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు: ప్రధాని మోడీ

కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు: ప్రధాని మోడీ
కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని, మెరుపుదాడులపై కూడా వారు రాజకీయాలు చేసి సైనికులను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   ఆ పార్టీ చేసేవన్ని చెత్త రాజకీయాలని విమర్శించారు. శనివారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ అనవసర భయాలు, అనుమానాలు సృష్టించే వారిని దూరంగా ఉంచాలని అన్నారు. అలాంటి వాళ్లు హాయిగా ఉండి మీ భయాలు, సందేహాలతో ఆడుకుంటారని.. అలాంటి మనుషులు, పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్తూ.. భయాలు సృష్టిస్తోందని అన్నారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి, మా హయాంలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ చర్చ జరుపుదాం రమ్మని ఆహ్వానిస్తే.. అలాంటి చర్చకు దూరంగా పారిపోతున్నారని మోదీ ఆరోపించారు. తాము ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ కోసం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ సమాజాన్ని విడదీస్తోందని ఆరోపించారు.రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. తమ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మోదీ ప్రజలకు గుర్తు చేశారు. ఇది రైతుల ప్రభుత్వం అని అన్నారు. ఏటా రూ.62వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని అన్నారు. మహిళా ఉద్యోగులకు 26వారాల మాతృత్వ సెలవులు ఇచ్చామని, త్రిపుల్‌ తలాక్‌ బాధితులకు విముక్తి కలిగించడంతోపాటు మహిళల భద్రతకోసం కృషి చేసామని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఇళ్లు, తాగునీరు, సాగు నీరు, గ్యాస్‌ కనెక్షన్లు అందించామని తెలిపారు. తాను కూడా పార్టీ కార్యకర్తనేనని అన్నారు. కింది స్థాయి నుంచి పార్టీ గెలుపుపై దృష్టి పెట్టాలని, బూత్‌లలో గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్లేనని వెల్లడించారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రాజస్థాన్‌ గౌరవ యాత్రను ఈరోజు అజ్మేర్‌లో ముగించారు.

Related Posts