ఆటపట్ల యువ సంచలనం పృథ్వీ షాకు ఉన్న అంకితభావంతో పాటు అతడి ఆత్మస్థైర్యం చూసి ఇంప్రెస్ అయ్యానన్నాడు సచిన్.టీమిండియా తరఫున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా ముంబై యువ సంచలనం పృథ్వీ షా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కేవలం ఒకే ఇన్నింగ్స్‌తో షాను భారత దిగ్గజ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌లతో పోలిక తేస్తుండగం గమనార్హం. పాఠశాల క్రికెట్, రంజీ క్రికెట్, దులీప్ ట్రోఫీలలో సచిన్ తరహాలోనే పృథ్వీ షా తొలి మ్యాచ్‌లలో శతకాలు బాదాడు. టెక్నిక్ సైతం సచిన్‌ను పోలి ఉంది. యువ సంచలనం పృథ్వీ షా టీమిండియాకు ఆడతాడని పదేళ్ల కిందటే తాను ఊహించానని సచిన్ తెలిపాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘స్కూలు క్రికెట్, రంజీలు, ఇతరత్రా ట్రోఫీల్లో రాణించే ఈ కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఆడతాడన్న దానిపై కాస్త ఉత్కంఠ ఉండేది. టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌తోనే పృథ్వీ షా నా అనుమానాలను పటాపంచలు చేశాడు. అతడిలో ఆట ఆడగల సామర్థ్యంతో పాటు స్మార్ట్‌నెస్ (టెక్నిక్ గేమ్) ఉంది. బ్యాక్ ఫుట్‌పై ఆడటంతో ఇబ్బంది పడతానని గతంలో షా నాతో చెప్పాడు. జగదీష్ చవాన్ సాయంతో దాదాపు పదేళ్ల కిందట పృథ్వీ షా నన్ను కలిశాడు. చాలా చిన్న వయసులోనే తన ఆటతీరును నాకు వివరించి, సూచనలు అడిగి తెలుసుకున్నాడు. ఆటపట్ల అతడికున్న అంకితభావంతో పాటు ఆత్మస్థైర్యం చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ కుర్రాడు కచ్చితంగా ఏదో ఓ రోజు టీమిండియాకు ఆడతాడని చెప్పా. నిజంగానా అని చవాన్ అడిగితే.. నా మాటలు గుర్తుపెట్టుకో అన్నాను. సరిగ్గా పదేళ్ల కిందట నా స్నేహితుడికి చెప్పిన మాటను నిజం చేశాడు పృథ్వీ షా. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆడితే విదేశాల్లోనూ పృథ్వీ షా సత్తా చాటుతాడని’ సచిన్ ధీమా వ్యక్తం చేశాడు.