అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు, అడ్వకేట్ జనరల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటీ దాడులు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల తదితర అంశాలపై చర్చించారు. బాబ్లీ పోరాటంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. ధర్మబాద్ కోర్టుకు భారీ ర్యాలీతో హజరైతే బాగుంటుందని చంద్రబాబుకి ఇప్పటికే కొందరు మంత్రులు సూచించారు. కోర్టుకు వెళ్లకుండా రీకాల్ పిటిషన్ వేయాలని పలువురు కోరారు. చిన్న కేసులకు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు హాజరుకావాలని సీనియర్ మంత్రులు సూచించారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. చివరికి రీకాల్ పిటిషన్ వేసేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం.సీఎంతో సమావేశమైన వారిలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులున్నారు.