Highlights
ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. అయితే ఏపీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 5 పార్లమెంట్ స్థానాలకు సైతం ఉప ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. దీనిపై ఈసీ స్పష్టతనిచ్చింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది జూన్ 4వ తేదీతో ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం గడువు ముగియనుంది. అయితే ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యం కాదని ఎన్నికల చట్టంలో ఉంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందాయి. అప్పటినుంచీ వచ్చే ఏడాదికి, జూన్ 4వ తేదీన లోక్‌సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. కనుక ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నేతల రాజీనామాలతో ఖాళీగా ఉన్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని’ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటంలో భాగంగా వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోగా ఒక్కొక్కరిగా నేతలను బలవంతంగా ఆస్పత్రికి తరలించి వైసీసీ నేతల దీక్షను భగ్నం చేసిన విషయం తెలిసిందే.