Highlights
దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గాపూజ కోసం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం కేటాయించిన నిధులపై కలకత్తా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దుర్గాపూజ కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం కేటాయించిన రూ.28కోట్ల పంపిణీ అక్టోబరు 9 వరకు నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దుర్గాపూజకు పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ద్యాయతీమాన్ ఛటర్జీ, సామాజిక కార్యకర్త సౌరవ్ గుప్తాలు దాఖలుచేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. ఏ ప్రాతిపదికన ఈ మొత్తం కేటాయించారని జస్టిస్ దేబశీష్ కర్ గుప్తా, జస్టిస్ షాంపా సర్కార్‌ల ద్విసభ్య ధర్మాసనం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వాన్ని విచారణ సందర్భంగా ప్రశ్నించారు. ‘ఏ నిబంధనల ప్రకారం డబ్బు కేటాయించారు? దీనికి ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా? కేవలం దుర్గా పూజలకేనా ఇతర పండుగలకు కూడా కేటాయింపులు చేస్తారా? ఈ నిధులు దుర్వినియోగం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి ఉన్న అప్పుల మాటేమిటి? ఓ వైపు రుణాలున్నాయని చెప్తున్నారు.. మరోవైపు పండగల కోసం డబ్బు కేటాయిస్తున్నారు.. దీన్ని ఎలా సమర్థించుకుంటారు?’ అని ధర్మాసనం నిలదీసింది. తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తూ తదుపరి విచారణలోగా అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది దుర్గా పూజ కోసం రూ.28కోట్లు కేటాయిస్తున్నట్టు సెప్టెంబరు 10 పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్‌కతా నగరంలోని 3000లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేల పూజా కమిటీలకు ఒక్కోదానికి రూ.10వేల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. లౌకిక రాష్ట్రంలో మతపరమైన ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది వికాశ్ రంజన్ భట్టాచార్య వాదించారు. అయితే, ‘సేఫ్ డ్రైవ్, సేవ్ లైఫ్’నినాదంతోనే పూజలకు నిధులు కేటాయించామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. న్యాయస్థానం ఆదేశాలు స్పందించిన సీఎం మమత, హైకోర్టు ఆదేశాలపై తమకు గౌరవం ఉంది.. కానీ ఇప్పటికే కమిటీలకు నగదు అందజేశాం.. మరి వాటిని ఎలా వెనక్కు తీసుకోగలం అని వ్యాఖ్యానించారు. మరోవైపు కోర్టు ఆదేశాలను బీజేపీ స్వాగతించింది.