Highlights
సర్గ- 50
మిథిలకు పోతున్న శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు
విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే, తమ్ముడితో కలిసి శ్రీరాముడు ఈశాన్య దిక్కుగా పోతూ, జనకుడు యజ్ఞం చేస్తున్న నందమనే ప్రదేశాన్ని చూశాడు. యజ్ఞానికి కావల్సిన సంభారాలు మిక్కిలి శ్లాఘ్యంగా వున్నాయని, నానా దేశాలనుండి బ్రాహ్మణ శ్రేష్టులు-వేదాధ్యయనంలో ప్రీతిగలవారు వేలాదిమంది వచ్చారని, గొప్ప ఋషీశ్వరులుండే ప్రదేశాలన్నీ వందలాది బండ్లతో నిండి వున్నాయని, ఇలాంటి ప్రదేశంలో తమెక్కడుండాలో చెప్పమని విశ్వామిత్రుడిని అడిగాడు రామచంద్రమూర్తి. జలసమృద్ధిగలిగి-సందడిలేని ఒక ప్రదేశాన్ని చూపించి, అందరం అక్కడుండేందుకు ఏర్పాట్లు చేయిస్తానంటాడు విశ్వామిత్రుడు. ముని శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చిన వెంటనే జనకుడు విశ్వామిత్రుడిని సేవించడంలో నిమగ్నమై వుండగా, ఋత్విజులొచ్చి, మునీశ్వరుడికి అర్ఘ్యం-పాద్యం ఇచ్చారు. వాటిని గ్రహించిన ముని, రాజు క్షేమ సమాచారాన్ని, యజ్ఞం చక్కగా జరుగుతున్న విషయాన్ని గురించి ప్రశ్నించి, అక్కడున్న ఋషీశ్వరులను గౌరవంగా పలకరించాడు. ఇలా సంభాషిస్తున్న విశ్వామిత్రుడిని, ఇతర మునీశ్వరుల సరసన ఆయనకు కేటాయించిన ఆసనం మీద ఆయన ఇష్టప్రకారం కూర్చోమని ప్రార్థించాడు జనకుడు. రాజును కూడా ఆయన ఆసనం పై కూర్చోమని కోరాడు విశ్వామిత్రుడు. జనకుడు ఋత్విక్కులతో, మంత్రులతో, పురోహితులతో ఆసనాలపై కూర్చొని విశ్వామిత్రుడితో సంభాషించాడు. "మునీంద్రా, నిన్ను దర్శించడం వల్ల నేను చేస్తున్న యజ్ఞ పుణ్యపలం నాకు ఈ రోజే లభించినట్లయింది. నిజానికి నీరాకతోనే, యజ్ఞానికై సమకూర్చుకున్న పదార్థాలన్నిటినీ దేవతలు పవిత్రం చేసారు నేడు. నీ అనుగ్రహంవల్ల నా జన్మ సార్థకమయింది. యజ్ఞం పూర్తి కావడానికి ఇంకా పన్నెండు రోజులుందని ఋత్విజులంటున్నారు. దాంతర్వాత హవిర్భాగం తీసుకునేందుకు దేవతలొస్తారు. వారిని దర్శించుకునేంతవరకు మీరిక్కడే వుండండి" అని పలికి జనకుడు, ఆయనవెంట వున్న రామ లక్ష్మణులెవరని ప్రశ్నించాడు. వారు, దోషరహితమైన పరాక్రమంగలవారని, దశరథ మహారాజు కొడుకులని జవాబిచ్చాడు. రామ లక్ష్మణులేవిధంగా తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను చంపారోనన్న విషయాన్ని, విశాల నగరాన్ని చూసిన విషయాన్ని, అహల్యకు శాప విమోచనం కలిగించిన విషయాన్ని, గౌతమ మహర్షిని కలిసిన సంగతిని కూడా చెప్పిన తర్వాత, విశ్వామిత్రుడు, వారిద్దరూ ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూసేందుకొచ్చారని అంటాడు.
రేపు తరువాయి భాగం..