శ్రీశైల మహాక్షేత్రంలో తొలిసారిగా భ్రమరాంబాదేవి దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న దీక్షను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీక్షకు సంబంధించిన నియమ నిబంధనలను శ్రీరామచంద్రమూర్తి వివరించారు. 19న దీక్షల విరమణ కాగా ఉత్సవాల తర్వాత భక్తులు మండల దీక్షలుగా వేసుకోవచ్చు. శ్రీశైల భ్రమరాంబాదేవి దీక్షను స్త్రీలు, పురుషులు ఆచరించవచ్చు. ఎర్రని రంగు దుస్తులను దీక్షా వస్త్రాలుగా ధరించాలి. గురుస్వామి చేత, అలయాల్లోని అర్చకుల చేత దీక్షను స్వీకరించవచ్చు. దీక్ష మాలలో 27, 54, 108 పగడములు లేదా పూసలు ఉండాలి. దీక్షదారులు రెండు పూటలా తలస్నానం చేసి అమ్మవారిని ఆరాధించాలి. పొడిగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి. నుదుట గంధము, కుంకుమబొట్టు ధరించాలి. శాకాహారం మాత్రమే చేయాలి. ఒక పూట భోజనం, రాత్రి అల్పాహారం వంటి ఆహార నియమాలు పాటించాలి. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. బ్రహ్మచర్యలన్నీ పాటిస్తూ నేలపై (చాపపై) విశ్రమించాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు. దీక్షకాలంలో క్షరకర్మ, గోళ్లు తీయడం లాంటివి చేయకూడదు. పాదరక్షలు దరించకూడదు. అమ్మవారిపై భక్తిని కలిగి ఎన్నిసార్లయినా ఓం శ్రీ భ్రమరాంబాయైనమః నామమంత్రాన్ని జపిస్తుండాలి. దేవస్థానం అందజేసే నామలేఖన పుస్తకంలో బ్రమరికోటి రాసుకోవాలి. దీక్షకాలంలో జాతశౌచంగాని, మ్రతశౌచంగాని వస్తే దీక్షను కొనసాగించకూడదు. ఆశౌచం ముగిసిన తర్వాత మళ్లీ దీక్షను పాటించవచ్చు. దీక్షకాలంలో స్త్రీలు రెండు చేతులకు ఎర్రని గాజులు ధరించి, కాళ్లకు విధిగా పసుపును రాసుకోవాలి. స్త్రీలు అమ్మవారిని పూజించేటప్పుడు తలజుట్టును ముడిగా వేసుకొని (జడవేసుకొని) పూజలు చేయాలి. తల విరబోసుకొని పూజలు చేయకూడదు. దీక్షకాలం పూర్తయ్యాక శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబాదేవికి శ్రీముడిని (ఇరుముడిని) సమర్పించి దీక్ష విరమణ చేయాలి. రెండు కొబ్బరికాయలు, అరకేజీ బియ్యం, రెండు ఎండుకొబ్బరి గిన్నెలు, పసుపు, కుంకుమ, చందనపొడి, అగరుబత్తిలు, కర్పూరాన్ని, దానిమ్మ మొదలైన ఎరుపురంగు గల పండ్లతో శ్రీముడిని కట్టుకోవాలి. దీక్షభక్తులు శ్రీముడిని స్వయంగా కట్టుకోవచ్చు లేదా స్థానిక ఆలయాల్లో గల అర్చకుల చేత కట్టించుకోవచ్చు.