చిత్తూరు జిల్లా నగరి టిక్కెట్‌పై టీడీపీలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు పుల్‌స్టాప్ పడబోతుందా.. గాలి ముద్దుకృష్ణమ ఫ్యామిలీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లేనా.. అంటే అవునంటున్నాయి పార్టీ వర్గాలు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇంట్లో సమావేశమైన గాలి కుటుంబ సభ్యులు.. టిక్కెట్ వ్యవహారంపై చర్చించారు. ముద్దుకృష్ణమ సతీమణి, ఇద్దరు కుమారులు బుద్దా వెంకన్నతో ఈ వ్యవహారంపై చర్చించారు. తమ కుటుంబంలో టిక్కెట్ ఎవరికి కేటాయించినా కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ మరో వ్యక్తికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పినట్లు సమాచారం. సోమవారం అధినేతను కలిసి తమ నిర్ణయాన్ని చెప్పాలని గాలి కుటుంబం నిర్ణయించింది. అలాగే నియోజకవర్గంలో విబేధాలను పక్కన పెట్టి ఏకతాటిపై పనిచేస్తామని చంద్రబాబుకు చెప్పనున్నారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత నగరి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన మృతితో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని సతీమణికి కేటాయించగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఈ టిక్కెట్ వ్యవహారాన్ని తేల్చేయాలని అధినేత భావించారు. అలాగే గాలి ఇద్దరు కుమారుల మధ్య విభేదాలతో.. కేడర్ అయోమయ పరిస్థితుల్లో పడింది. ఈ వ్యవహారం అధినేతకు తెలియడంతో.. శనివారం గాలి కుటంబ సభ్యులు, నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నగరి నుంచి వచ్చిన ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు. గాలి కుటుంబంలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని నేతలు తేల్చి చెప్పారు. అయితే గాలి కుమారులు భాను, జగదీశ్‌పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విభేదాలు పార్టీకి మంచిదికాదని.. ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. ముద్దుకృష్ణమ ఉన్నంతకాలం పార్టీ, కుటుంబం కలిసి పనిచేశాయని.. ఆయన మరణం తర్వాత పరిస్థితులు మారిపోవడం ఏంటని ప్రశ్నించారు. ముద్దుకృష్ణమ కుటుంబానికి ఒక రోజు గడువు ఇచ్చిన చంద్రబాబు.. ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. అలా జరగని పక్షంలో నియోజకవర్గ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తానని హెచ్చరించారు. దీంతో ఆదివారం బుద్ధా వెంకన్న నివాసంలో సమావేశమై.. ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే ఏకాభిప్రాయం కుదిరినా.. టిక్కెట్ ఎవరికి కేటాయించాలన్నది ఇప్పుడు చంద్రబాబు నిర్ణయించాల్సి ఉంది. గాలి కుటుంబంలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా.. మరో ఆప్షన్ ఏదైనా ఎంచుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది.