అవును ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీల్లో కన్నా జనసేనకు పొలిటికల్ బ్రోకర్ల బెడద పట్టుకుంది. ఏపీలో ప్రధాన పక్షాలుగా తెలుగుదేశం, వైసిపి నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీల్లో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా వుంది. ఇక సంస్థాగత నిర్మాణంలో వైసిపి రెండో స్థానం లో నిలుస్తుంది. ఈ రెండు పార్టీలు టికెట్ల పంపిణీ వ్యవహారం అంతా సాఫీగానే సాగిస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ప్రస్తుతం సీన్ అలా లేదు. సంస్థాగత నిర్మాణం లోనే బాలారిష్టాలు ఎదుర్కొంటుంది జనసేన. ఇప్పడిప్పుడే జనసేన రెండు ప్రధాన పక్షాలను ఎదుర్కొని నిలబడాలని గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఈ క్రమంలో ఆ పార్టీకి మరో ప్రధాన సమస్య ఎదురవుతోంది.జనసేనాని కి అత్యంత సన్నిహితులమని టికెట్లు ఖరారు కావాలంటే తమను ప్రసన్నం చేసుకుంటే చాలని కొందరు మాయగాళ్లు జనసేనలో చురుగ్గా తమ పని మొదలు పెట్టేశారు. గతంలో ఇదే తీరులో ప్రజారాజ్యంలోనూ ఇలాంటి వారు చేసిన పొరపాట్లకు మెగాస్టార్ చిరంజీివి మూల్యం చెల్లించాలిసి వచ్చింది. ఇది అధ్యయనం చేసిన పవన్ ముందే బ్రోకర్ల హవాకు బ్రేక్ లు వేసే పనిలో పడ్డారు. టికెట్లు ఇచ్చే కమిటీ జనసేనలో ఉందని, అయితే ఎవరిని బడితే వారిని నమ్మి మోసపోవొద్దని ముందే హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం టికెట్ మాత్రమే ప్రకటించామని మరే టికెట్ ఖరారు చేయలేదని పవన్ విస్పష్ట ప్రకటన చేయాలిసి వచ్చింది అంటే పరిస్థితి అర్ధమైపోతుంది. ఇప్పటివరకు పితాని బాలకృష్ణ కు మాత్రమే టికెట్ ఖాయం చేశామని చెప్పారు. వేరేవారికి ఇవ్వలేదని స్వయంగా జనసేన అధినేతే ప్రకటించుకునే పరిస్థితి జనసేన లో కొందరు నేతలు కల్పించేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలంటూ ఆ పార్టీ క్యాడర్ పవన్ పై వత్తిడి తెస్తున్నారు. ఆయన ముందే ప్లే కార్డు లు ప్రదర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ఎపి తీవ్రంగా నష్టపోయిందని తన దృష్టి మొత్తం అక్కడే అంటూ జనసేనాని పోటీ కి ఎస్ అని కానీ నో అని కానీ స్పష్టం గా ప్రకటించకపోవడం చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ కి బరిలోకి దిగేది అనుమానమే అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క జనసేనను నమ్ముకున్న సిపిఎం పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్క లా మారింది. ఒకవేళ జనసేన పోటీ చేయని పక్షంలో సిపిఎం మహాకూటమితో కలిసి వెళుతుందా ? లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అన్న అంశం త్వరలో తేలనుంది.