దేశం నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈశాన్య రుతు పవనాల ప్రవేశం ఒకే రోజు జరుగుతోందని భారత వాతవరణ కేంద్రం ప్రకటించింది. సాధారణంగా సెప్టెంబరు 20 నాటికి నైరుతి దేశం విడిచిపోవాలి. ఈ ఏడాది ఉత్తరాదిలోని హిమాలయాల్లో నైరుతి చిక్కుకుపోవడంతో ఆలస్యంగా నిష్క్రమణ ప్రారంభమైంది. దీంతో అక్టోబరు 1కే ప్రవేశించాల్సిన ఈశాన్యం 8వ తేదీ వరకూ రాలేదు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి నైరుతి వెళ్లిపోతుందని, అదే సమయంలో తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, వాటికి ఆనుకుని ఉన్న ఎపిలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండి తెలిపింది. ఇది అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. అల్పపీడనం వాయువ్య దిశగా ముందుకు కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారి 72 గంటల్లో ఒడిశా తీరాన్ని తాకుతుందని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్య అరేబియాలో కొనసాగుతున్న వాయుగుండం మధ్యాహ్నం తీవ్రరూపం దాల్చిందని ఐఎండి తెలిపింది. 24 గంటల్లో తుపానుగా మారి పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఒమన్, యోమెన్ తీరానికి 5 రోజుల్లో చేరుకుంటుందని పేర్కొంది.అరేబియాలోని వాయుగుండం పశ్చిమవైపు వెళితే బంగాళాఖాతంలోని అల్పపీడనం ఉత్తరాంధ్ర, ఒడిశావైపు వచ్చే అవకాశం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం విశ్రాంత శాస్త్రజ్ఞులు రాళ్లపల్లి మురళీకృష్ణ వివరించారు. అరేబియాలో వాయుగుండం బలపడి తుపానుగా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం పెద్దగా ప్రభావం చూపే అవకాశాలుండబోవన్నారు. ఏదేమైనా రెండ్రోజుల్లో కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.