ఎఫ్‌డిఐ విధానంలో భారీ మార్పులు..
ఆమోదించిన ప్రభుత్వం..
సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం ఎఫ్‌డిఐ ఆటోమేటిక్ మార్గంలోనే
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ప్రభుత్వం మరోసారి భారీ మార్పులు చేసింది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో ఆటోమేటిక్ మార్గంలోనే 100 శాతం ఎఫ్‌డిఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న ఎయిర్‌ఇండియాలో 49 శాతం వాటా తీసుకునేందుకు విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలను అనుమతించింది. నిర్మాణం, విద్యుత్ ట్రేడింగ్ రంగాల్లోనూ, వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ, విదేశీ పెట్టుబడులున్న సంస్థల ఆడిటింగ్ కంపెనీలకు సంబంధించి ఎఫ్‌డిఐ విధానాల్లో మార్పులు చేసింది. 2018-19 వార్షిక బడ్జెట్‌కు కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ భారీ ‘ఎఫ్‌డిఐ సంస్కరణ’లకు ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక మంత్రి జైట్లీ ఫిబ్రవరి ఒకటిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే. దావో్‌సలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ ప్రపంచపెట్టుబడిదారులకు, సంస్థలకు ఆర్థిక సంస్కరణల విషయంలో తమ నిజాయితీని, నిబద్ధతను స్పష్టం చేసేందుకు ఈ నిర్ణయాలను తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.
సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం పెట్టుబడిని ఆటోమేటిక్ మార్గం లో అనుమతించడం వల్ల స్వీడన్‌కు చెందిన బహుళజాతి ఫర్నిషింగ్ సంస్థ ఐకియాకు లాభం కలిగే అవకాశం ఉంది. భారత్‌లో భారీ ఎత్తున విస్తరణ యోచనలో ఉన్న ఈ సంస్థ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో మరికొద్ది నెలల్లోనే ప్రారంభించనుంది.
సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం ఎఫ్‌డిఐకి ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతులకు లోబడి మాత్రమే ఆమోదం ఉంది.
ఎయిర్ ఇండియాకు విదేశీ నిధులు
ఎయిర్ ఇండియాను వదిలించుకునే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం తాజాగా 49 శాతం వరకు ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలను అనుమతించాలని నిర్ణయించింది. విదేశీ సంస్థ వాటా 49 శాతం మించకూడదని, ఎయిర్‌ఇండియాపై నికర యాజమాన్య హక్కులు భారతీయ సంస్థకే ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2017 మార్చినాటికి ఎయిర్ ఇండియా రుణాల మొత్తం 48877 కోట్ల రూపాయలుంది. ఇందులో 17360 కోట్ల రూపాయలు విమానాల కొనుగోలుకు సంబంధించిన రుణం కాగా 31,517 కోట్ల రూపాయలు వర్కింగ్ కాపిటల్ రుణం. 2017-18లో ఈ సంస్థ మరో 3579 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
విద్యుత్ ట్రేడింగ్‌లో..
విద్యుత్ ట్రేడింగ్ కోసం ఏర్పాటైన ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి కూడా విదేశీ పెట్టుబడి నిబంధనలను సరళతరం చేశారు. ప్రస్తుతం పవర్ ఎక్స్జేంజీల్లో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడికి ఆటోమేటిక్ మార్గంలో అనుమతి ఉంది. ఎఫ్‌ఐఐలు మాత్రం ఎక్చ్జేంజీల్లో వాటాలను సెకండరీ మార్కెట్ల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
రియల్ బ్రోకర్లకు ఊరట
రియల్ ఎస్టేట్ బ్రోకింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ రెండూ వేరువేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎఫ్‌డిఐ నిబంధనల ప్రకారం, రియల్ బ్రోకింగ్ సర్వీసులను రియల్ బిజినె్‌సగా పరిగణించరాదని స్పష్టం చేసింది. అందువల్ల రియల్ బ్రోకింగ్ సంస్థల్లోకి 100 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ రూట్‌లోనే అనుమతించవచ్చు.
మరికొన్ని ప్రతిపాదనలు
ఆటోమేటిక్ రూట్‌లో ఎఫ్‌డిఐకి ఆమోదం ఉన్న రంగాల్లోని సంస్థలకు ప్రీ ఇన్‌కార్పొరేషన్ ఖర్చులు, యంత్రాల దిగుమతి వ్యయాన్ని కూడా ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. గతంలో ఇన్‌కార్పొరేషన్‌కు ముందు జరిపే వ్యయానికి ప్రభుత్వ ఆమోదం తప్పని సరిగా తీసుకోవాలన్న నిబంధన ఉంది.
ఏఐపై సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి
ఎయిర్ ఇండియాలో 49 శాతం వరకు వాటా కొనుగోలుకు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు అనుమతిచ్చిన కొద్ది గంటల్లోనే సంస్థలో వాటా కొనుగోలుకు మేము సిద్ధమని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రస్తుతానికైతే విస్తారా వ్యాపారమే మా ప్రాధాన్యమన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిర్‌ఇండియా ప్రైవేటీకరణ విషయంలోనూ ఆసక్తిగా ఉన్నట్లు ఇ-మెయిల్ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. టాటాసన్స్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన విస్తారాలో ఈ ఎయిర్‌లైన్‌కు 49 శాతం వాటా ఉంది.
ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌డిఐ విధానంలో భారీ ఎత్తున మార్పులు చేయడం ఇది రెండోసారి 2016 జూన్‌లో మొదటిసారి భారీ మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై వచ్చిన వ్యాఖ్యలు..
లాభపడనున్నవిదేశీ మొబైల్ కంపెనీలు
రిటైల్ రంగంలో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డిఐని అనుమతించాలన్న నిర్ణయం వల్ల యాపిల్‌తో పాటు చైనా మొబైల్ బ్రాండ్లు షామీ, ఒప్పో భారీగా లాభపడే అవకాశం ఉంది. ఎడాపెడా తమ ఉత్పత్తులను విక్రయిస్తూ మార్కెట్ పెంచుకుంటున్న విదేశీ మొబైల్ కంపెనీలు ఇక నేరుగా విక్రయ కేంద్రాలను తెరిచి వినియోగదారులకు మరింత చేరువగా వెళ్తాయని విశ్లేషకుల అంచనా.
అద్భుతం...
రిటైల్ వ్యాపారుల సంఘం సర్కారు సరళతర విధానాలపై ఎక్కడాలేని ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే, మల్టీబ్రాండ్ రిటైలింగ్‌లోనూ ఎఫ్‌డిఐని అనుమతిస్తే బాగుండేదని రిటైల్ వ్యాపారుల సంఘం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశంలోకి కొత్త కొత్త బ్రాండ్స్ వస్తాయని, వినియోగదారులకు లాభం కలుగుతుందనీ, ఉద్యోగాలు పెరుగుతాయని కూడా సంఘం తెలిపింది.
ఆందోళన వ్యక్తం చేసిన ట్రేడర్లు
ఎఫ్‌డిఐ విధానాలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫడరేషన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా రిటైల్ రంగానికి సంబంధించిన నిర్ణయం వల్ల స్థానికంగా ఉపాధి దెబ్బతింటుందని ఆందోళనవ్యక్తం చేసింది. అలవోకగా బహుళజాతి సంస్థలు భారత్‌లో అడుగుపెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందని ఆక్షేపించింది.