భారతదేశంలో యువశక్తికి కొదవలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ) వజ్రోత్సవ ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 60 వసంతాల నిట్ ప్రస్థానాన్ని వివరించే సంక్షిప్త ఛాయాచిత్ర మాలికను ఆయన ఆవిష్కరించారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అల్యుమినీ కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా గతంలో ఆర్ఈసీ కళాశాలకు ప్రిన్సిపల్స్‌గా పనిచేసిన పలువురిని వెంకయ్యనాయుడు ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నిట్ సంచాలకులు ఎన్వీ రమణారావు, ఇతర ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు సరికొత్త పరిశోధనలు, నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడేలా, వారి జీవితాన్ని సౌకర్యవంతం చేసేలా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం భారత్ వైపే చూస్తోందని.. ఈ దశలో మనం మరింతగా ప్రతిభా పాటవాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎంత సాధించినా.. సంస్కృతిని మరిచిపోవద్దని, ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోవాలన్నారు. భారతావని భవిష్యత్ భాండాగారంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. దేశంలోని వర్శిటీలు, ఐఐటీలు ఈ దిశగా విద్యార్థులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. తల్లిదండ్రులు, పుట్టిన ఊరుని, మాతృభాషను మరువద్దని.. మన భాష, యాసను పరిరక్షించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు... వరంగల్ నగరంతో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నోసార్లు ఇక్కడకు వచ్చానని... నిట్ క్యాంపస్‌లోనే బస చేశానని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వెంకయ్యనాయుడు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. నిట్ సాధించిన ప్రగతిని సంచాలకులు ఎన్వీరమణారావు తన స్వాగత ఉపన్యాసంలో వివరించారు