ఆలయంలోకి ప్రవేశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఆలయ ప్రవేశానికి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై.. జాతీయ అయ్యప్ప స్వామి భక్తుల సంఘం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తే ఆచారాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. కోర్టు తీర్పు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. వారి హక్కుల్ని కాలరాసే విధంగా ఉందన్నారు. మరోవైపు ఈ పిటిషన్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యతగల ప్రభుత్వంగా తమపై ఉందన్నారు. అయితే ఈ తీర్పుపై చర్చలు కూడా జరగాల్సి ఉందన్నారు. అలా అని భక్తులతో గొడవపడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. వారి మనోభావాలను కూడా గౌరవిస్తామన్నారు. ప్రభుత్వం కూడా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందన్నారు. సెప్టెంబర్ 28న అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు కేరళ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతుండగా.. ఆదివారం చెన్నై, ఢిల్లీలో కూడా భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా రోడ్డెక్కి గళమెత్తుతున్నారు. మరి ఈ రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.