ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 884 పాయింట్లతో బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ కోహ్లి నెం.1 స్థానంలో నిలవగా.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 797 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే.. ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం అఫ్గానిస్థాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ 353 పాయింట్లతో నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో 127 పాయింట్లతో ఇంగ్లాండ్ టీమ్ అగ్రస్థానంలో నిలవగా.. 122 పాయింట్లతో భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లితో పాటు రోహిత్ శర్మ (842), శిఖర్ ధావన్ (802) టాప్-5లో నిలిచారు. ఇటీవల దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో రోహిత్, శిఖర్ అద్వితీయ శతకాలు బాది భారత జట్టుని విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. దీంతో.. రోహిత్‌కి రెండో స్థానం దక్కగా.. ధావన్ ఐదో స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో బుమ్రా తర్వాత కుల్దీప్ యాదవ్‌కి మాత్రమే భారత్ తరఫున టాప్-5లో చోటు దక్కింది. 700 పాయింట్లతో కుల్దీప్ మూడో స్థానంలో నిలిచాడు. కానీ.. ఆల్‌రౌండర్ జాబితాలో మాత్రం ఏ భారత క్రికెటర్‌కీ టాప్-10లో చోటు దక్కలేదు.