వెల్లువలా జనం వెంట నడువగా విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం ఆనందపురం క్రాస్ వద్ద ప్రజాసంకల్పయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఆనందపురం క్రాస్ వద్ద ఈ మైలురాయికి గుర్తుగా జననేత వేప మొక్కను నాటారు. 281 వరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత సోమవారం గుర్ల శివారు, కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్, అనందపురం క్రాస్ మీదుగా గరికవలస వరకూ నేటి యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర సాగిన రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు మండుటెండ.. ఉక్కపోత. జనం ఇవేవీ లెక్కచేయ లేదు. అడుగు కూడా ఖాళీ కన్పించనంతగా జనం కిక్కిరిసిపోయారు. తమనేతను కలవాలని, కష్టాలు చెప్పుకోవాలని పోటీపడ్డారు. ఆయన రాకకోసం గంటల తరబడి నిరీక్షించారు. కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. మేడలు, చెట్లు, గోడలు, స్తంభాలు.. ఎక్కారు. అక్కడి నుంచి జగన్ స్పష్టంగా కన్పించారంటూ సంతోషించారు.