YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ ఆశాకిరణంగా కెప్టెన్

 కాంగ్రెస్ ఆశాకిరణంగా కెప్టెన్
ఆరు, ఏడు దశకాల్లో దిగ్గజాల్లాంటి నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు. రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా, ప్రజాదరణ గల నాయకులుగా గుర్తింపు పొందిన వారు పార్టీ విస్తరణకు పాటుపడ్డారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రస్తుతం ఈ కోవలోకే చెందుతారు. ప్రజా బాహుళ్యంలో పట్టున్న నాయకుడిగా అమరీందర్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి గౌరవనీయ స్థానాలను సంపాదించి పెట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. తాజాగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో హస్తం పార్టీ హవా కొనసాగడానికి అమరీందరే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీ అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ప్రత్యర్థులైన శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల అడ్రస్ లు గల్లంతయ్యాయి. మొత్తం 353 స్థానాలు (93.7 శాతం) సాధించి కాంగ్రెస్ తనకు తిరుగులేదని చాటింది. అదేవిధంగా 2899 పంచాయతీ సమితి స్థానాల్లో 2351 స్థానాలు (81 శాతం) సాధించి విజయ పతాకం ఎగురవేసింది. అకాలీదళ్, బీజేపీ లు కేవలం 18 పంచాయతీ సమితి స్థానాలను, కేవలం రెండు జిల్లా పరిషత్ జోన్లను మాత్రమే చేజిక్కించుకున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఖాతాను కూడా తెరవలేక పోయింది. ఈ పార్టీకి రాష్ట్రంలో నలుగురు పార్లమెంటు సభ్యులు ఉండటం గమనార్హం. భగవత్ మాన్ (సంగూర్), ధర్మవీర గాంధీ (పాటియాలా), హరీందర్ సింగ్ ఖల్సా (ఫత్ గడ్ సాంగిల్) సాధు సింగ్ (ఫరాజ్ కోట్) కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లోనూ పేలవమైన పనితీరు కనపరచడం గమనించదగ్గ విషయం. మొత్తం 2899 పంచాయతీ సమితి స్థానాలకు గాను అకాళీదళ్ 352, బీజేపీ 63, ఆమ్ ఆద్మీ పార్టీ 20, సీపీఐ 1, సీపీఎం 2, అకాలీదళ్ (ఎ) చీలికవర్గం రెండు స్థానాలను సాధించాయి. అంతర్గత కలహాల కారణంగా విపక్షాలు కుదేలయ్యాయి. కొన్నిచోట్ల సరైన అభ్యర్థులను కూడా నిలపలేకపోయాయిఈ ఘన విజయానికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కారణమన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన సత్యం. పార్టీని విజయపథంలో నడిపించడంలో ఆయన పాత్ర తిరుగులేనిది. 2017 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారకుడు ఆయనే. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు రెండే రెండు. వాటిల్లో పంజాబ్ ఒకటి. రెండోది ఈశాన్యాన అతి చిన్న రాష్ట్రం మిజోరాం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో విజయం హస్తం పార్టీకి ప్రాణం పోసింది. కెప్టెన్ అమరీందర్ మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. మధ్యలో ఒకసారి అకాలీదళ్ లో చేరినప్పటికీ మళ్లీ కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు. రాష్ట్రంలో పార్టీకి బలం, బలగం అన్నీ ఆయనే. పార్టీలో తిరుగులేని, ఎదురులేని నాయకుడు.1943 మార్చి 11న జన్మించిన అమరీందర్ కొంతకాలం సైన్యంలో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన అనంతరం 1963లో సైన్యంలో చేరారు. 1965లో రాజీనామాచేసి వెనక్కు వచ్చారు. 1965 భారత్ – పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. సిక్కు రెజిమెంట్ లో పనిచేశారు. చదువుకునే రోజుల్లో రాజీవ్ గాంధీ సహాధ్యాయి అయిన అమరీందర్ ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1984లో అమృత్ సర్ స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు నిరసనగా లోక్ సభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి అకాలీదళ్ లో చేరారు. అనంతరం అసెంబ్లీకి ఎన్నికై మంత్రి అయ్యారు. పంచాయతీరాజ్, వ్యవసాయం, అటవీ శాఖలను నిర్వహించారు. అనంతరం అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు. సొంత పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. చివరికి సొంత నియోజకవర్గంలోనూ 856 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1998 లోక్ సభ ఎన్నికల్ల పోటీ చేసి పాటియాలా నియోజకవర్గం నుంచి 33,251 ఓట్ల తేడాతో విజయం సాధించారు.రెండు సార్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా (1999-2002, 2008-2013) వ్యవహరించారు. 2002 నుంచి 2007 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమృత్ సర్ అభివృద్ధి బోర్డుకు భూమి అప్పగింతలో అవకతవకలకు పాల్పడ్డారంటూ పంజాబ్ అసెంబ్లీ కమిటీ 2008లో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది. అప్పట్లో అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఆయన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. శాసనసభ్యత్వం రద్దు అక్రమం అంటూ కోర్టు తీర్పు చెప్పడం అప్పట్లో ఆయనకు పెద్ద ఉపశమనం. పంజాబ్ రాజకీయాల్లో అమరీందర్ కు గల ప్రాధాన్యం దృష్ట్యా పార్టీ ఆయనకు పెద్దపీట వేసింది. 2013 నుంచి ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకీ ఆయన శాశ్వత ఆహ్వానితుడు కావడం ఇందుకు నిదర్శనం. 2014 లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షకు ఓట్లకుపైగా తేడాతో ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఓడించడం విశేషం. ప్రజల్లో ఆయనకు గల పట్టుకు ఈ విజయం నిదర్శనం. అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనమని చెప్పవచ్చు. పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, సమన, తల్వండిసాబో నియోజకవర్గంనుంచి ఒక్కొక్క సారి విజయం సాధించారు.డెహ్రాడూన్ లో రాజీవ్ గాంధీ సహాధ్యాయి అయిన అమరీందర్ తొలి నుంచి తిరుగులేని కాంగ్రెస్ వాది. ఆయన భార్య ప్రణీత్ కౌర్ ఎంపీగా పనిచేశారు. 2009-2014 మధ్య కాలంలో ఆమె విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. సిక్కుల్లో జాట్ వర్గానికి చెందిన అమరీందర్ సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. పూర్వపు పాటియాలా సంస్థానం వారి కుటుంబం పరిధిలోనే ఉండేది. వారి కుటుంబానికి పాటియాలా మహారాజా కుటుంబంగా పేరుంది. అందువల్లే మూడుసార్లు ఇక్కడి నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అమరీందర్ సోదరి హమిందర్ కౌర్ మాజీ విదేశాంగ మంత్రి. కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ ను వివాహమాడారు. మొత్తానికి అమరీందర్ పంజాబ్ రాజకీయాల్లో ఒక శక్తి. రాష్ట్ర కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడు. ప్రస్తుతం అటు పార్టీలో, ఇటు రాష్ట్రంలో ఆయన ప్రభ వెలుగుతోంది.

Related Posts