ఏపీలో వామపక్షాలకు ప్రతిపక్షాల మద్దతు రాష్ట్ర బంద్ విజయవంతమైంది. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు 13 జిల్లాల్లో ధర్నాలు.. రాస్తారోకో.లతో తమ నిరసనను ప్రకటించారు ప్రజలు..రోడ్లమీదే..స్వచ్ఛందంగా ప్రజలు బంద్లో పాల్గొనడంతో .బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఒక్క బస్సు చక్రం కూడా కదల్లేదు.. కాలేజీలు తెరుచుకోలేదు.. కార్యాలయాల్లో పనులు జరగలేదు.. సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కసారిగా స్తంభించింది. వామపక్షాలు ఇచ్చిన పిలుపునకు ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలపడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తమ ఎంపీలకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు చేయడంతో సమైక్యాంధ్ర కోసం జరిగిన ఉద్యమాల తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో భారీ ఎత్తున పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రమంతా ‘బంద్’ అయ్యింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొని దీన్ని సంపూర్ణంగా విజయవంతం చేశారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాలకు తోడు.. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో కూడా కేటాయింపులు సరిగా లేకపోవడాన్ని నిరసిస్తూ గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు బంద్‌లో పాల్గొని ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ కర్ఫ్యూ వాతావరణం కనబడింది.
ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాల, పాఠశాలలకు శెలవు ప్రకటించింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు కూడా బంద్ సందర్భంగా విజయవాడలో విధి నిర్వహణ చేయడం విశేషం. కాగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న ద్రోహానికి నిరసనగా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శిరోముండనం చేయించుకున్నారు. ఉయ్యూరు సెంటర్‌లో నడిరోడ్డుపై గుండు చేయించుకుని నిరసన తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులను మూసి రాష్ట్ర విభజన చేసిందని, ఇప్పుడు మూడేళ్లుగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అన్ని అగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపి నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల ముందు ఎండగట్టింది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం బంద్‌కు సంఘీభావంగా గురువారం పాదయాత్రకు విరామం ఇచ్చి.. పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆయన మండిపడ్డారు.