తెలంగాణాలో ఎన్నికలు జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో చేస్తున్న పనులు అందరూ చూస్తున్నారు. అక్కడ ఏమి మాట్లాడకుండా, కనీసం ఒక క్లారిటీ కూడా ఇవ్వకుండా, పవన్ చేస్తున్న పనులు, తన అభిమానులకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి. అసలు పోటీ చేస్తారా చెయ్యరా, లేకపోతే కెసిఆర్ కు పూర్తి మద్దతు ఇస్తారా ? ఎదో ఒకటి క్లారిటీ ఇవ్వండి అంటూ పవన్ అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, పవన్ విషయంలో క్లారిటీ వచ్చి, దూరం అయిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్, తన సొంత ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.తెలంగాణాలో కనీసం 25 అసెంబ్లి స్థానాల్నుంచి పోటీ చెయ్యాలని అనుకున్నాని జనసేనాని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే దీని పై ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో పోటీకి అవకాశాల్లేవ న్నారు. అలాగే మరే పార్టీకి మద్దతిచ్చే ఆలోచన కూడా తమకులేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175స్థానాల్లో తామే స్వయంగా బరిలో దిగుతామని పవన్ తెలిపారు. ప్రతి ఒక్క నియోజకవర్గం తమకు ముఖ్యమేనన్నారు.పోటీ విషయంలో ఎవరికెలాంటి సందేహాలు అవసరంలేదన్నారు. మెజార్టీ స్థానాల్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు పర్యటన అనంతరం ఉత్తరాంధ్రలో మరోసారి పర్యటన నిర్వహిస్తామన్నారు. అనంతరం రాయలసీమ జిల్లాల్లో పర్యటన ఉంటుందన్నారు. 15న కాటన్ బ్యారేజ్ మీదుగా కవాతు చేసుకుంటూ తూర్పులో ప్రవేశిస్తామన్నారు. ఈ కవాతు పట్ల జనంలో భారీ అంచనాలు ఉన్నాయన్నారు. ఎవరికివారు తరలొచ్చేందుకు స్వచ్ఛందంగా సిద్దమౌతున్నారన్నారు. రాష్ట్రంలో ఐటి దాడులపై పవన్ స్పందించారు. ఆదాయపన్ను అధికారులు దాడులు చేయడం కక్షసాధింపు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అయితే ఇదే సందర్భంలో, గతంలో తన పై ఐటి దాడులు జరిగాయని, చంద్రబాబు చేపించారని పవన్ చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాలి.