గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకుని ఆంధ్రప్రదేశ్‌లో జెండా ఎగురవేయాలని భావిస్తున్నాడు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి. అందుకోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అవన్నీ వర్కౌట్ అవుతాయో లేదో గానీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం వెంటనే ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయిపోయాడట. ప్రస్తుతం ఈ ఆసక్తికర విషయం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో విశాఖలో జగన్ తల్లి విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం ఆమె పోటీ చేయనని తెగేసి చెప్పారని గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు జగన్ తప్ప ఆ కుటుంబం నుంచి ఇంకొకరు విజయం సాధించకపోవడంతో, అందుకోసమైనా ఈ సారి కుటుంబం నుంచి మరొకరిని గెలిపించుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఆయన సోదరి షర్మిలను బరిలోకి దించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ నేతలు కూడా సుముఖంగా ఉన్నారని వినికిడి.అవినీతి ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ జైలుకెళ్లినప్పుడు ఆ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిల. రాజన్న కూతురిని, జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో 3000వేల పైచిలుకు కిలో మీటర్లు ఆమె యాత్ర చేశారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక దూరం పాదయాత్ర చేసిన మహిళగా రికార్డులకెక్కారు. ఇదంతా పక్కన పెడితే, వైఎస్ షర్మిలను.. వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని జగన్ భావిస్తున్నాడట. షర్మిల ఎంపీగా పోటీ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీగా ఉన్నాడట జగన్ మోహన్ రెడ్డి. కొద్దిరోజులుగా షర్మిలను పోటీకి నిలబెట్టే విషయంలో విశాఖపట్టణం, ఒంగోలు, రాయలసీమలోని పలు నియోజకవర్గాలను పరిశీలించాడని, ఆయా స్థానాల్లో కీలక నేతలు ఉన్నందున వీటిని కాకుండా ఇప్పుడు మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే టీడీపీ సిట్టింగ్ స్థానమైన గుంటూరు పార్లమెంట్ స్థానమని సమాచారం. 2014లో ఇక్కడ జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్ధి గల్లా జయదేవ్.. వైసీపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరిపై దాదాపు డెబ్బై వేల మెజారిటీతో విజయం సాధించారు.