దేశీయ కరెన్సీ 'రూపాయి' మరోసారి జీవనకాల కనిష్టస్థాయికి పతనమైంది. మంగళవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ రూ.73.93 వద్ద ప్రారంభమైంది. తర్వాత కాస్త బలపడి రూ.73.88 వద్దకు చేరుకుంది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో కుదేలైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరోసారి 84 డాలర్లను అధిగమించడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో మిడ్ సెషన్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 74.27 శాతానికి పడిపోయింది. అక్టోబరు 5న ఇంట్రాడేలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.23గా నమోదై రికార్డు స్థాయిలో పతనమైంది. కాగా ఈరోజు ఆ రికార్డును అధిగమించింది. దిగుమతిదారులనుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పుంజుకోవడం, ద్రవ్య లోటు పెరగడం, పెట్టుబడుల ఉపసంహరణలు దేశీయ కరెన్సీపై భారం పెరగడంతో ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్నాయి.