ఏపీలో జల వనరులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా ఎఫ్1 హెచ్2ఓ పవర్‌బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి ప్రపంచస్థాయి పోటీలు కనుక ఈ జల క్రీడలను అందరూ మెచ్చేలా ఘనంగా నిర్వహించాలని చెప్పారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఎఫ్1 హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు చేస్తున్న ఏర్పాట్ల పై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. కృష్ణా, గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించిన జనం వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈసారి అంతకు మించిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఈ పోటీలను చూసేందుకు విజయవాడ వస్తారని, 2, 3 లక్షల మంది వచ్చినా సరిపోయేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిధులు, క్రీడాకారులు, పత్రికారంగానికి చెందిన వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈరోజు నుంచి ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్ ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపాలని చెప్పారు. ముఖ్యంగా, విద్యార్ధుల భాగస్వామ్యం తీసుకోవాలని అన్నారు. ‘జల వనరులే రాష్ట్రానికి వరం. జల వనరులకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నామో ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా పోటీలకు అనుబంధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పర్యాటక ప్రాధాన్యం గురించి విద్యార్ధులకు అవగతం అయ్యేలా వివిధ పోటీలు పెట్టాలని, కార్యగోష్టి నిర్వహించాలని తెలిపారు. అలాగే, అంతర్జాతీయ క్రీడాకారులకు మన ఘనమైన వారసత్వ గొప్పతనాన్ని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి వరకు వివిధ వర్గాలతో నిర్వహణా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.ఎఫ్1 హెచ్2ఓ పవర్ బోటు రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై ఈ సమావేశంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం కె మీనా ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. విజయవాడ ప్రకాశం జలాశయమే వేదికగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు గాను ఒక్కో జట్టు నుంచి 50 సభ్యులు చొప్పున 500 మంది క్రీడాకారులు వస్తున్నట్టు తెలిపారు. వీరికి అందించే ఆహారంలో ఆంధ్ర వంటకాలను అందించాలని నిర్ణయించామన్నారు. ఎక్కువ మంది ప్రజలు పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒకేసారి లక్షమంది కూర్చొని వీక్షించేలా బాల్కనీల ఏర్పాటు చేస్తున్నామని, వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన సభ్యులు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఉంటాయని తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న హోటళ్లలో 4,500 గదులను బుకింగ్ చేసి వుంచామని చెప్పారు. ఇవిగాక మరో 150 ఇళ్లను అద్దెకు తీసుకున్నామన్నారు. ఎఫ్1 హెచ్2ఓ ఛాంపియన్‌షిప్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు