YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

గ్రూప్‌- 1లో నియామక ప్రక్రియలో అక్రమాలు

గ్రూప్‌- 1లో నియామక ప్రక్రియలో అక్రమాలు

- తక్కువ మార్కులొచ్చినా ఇంటర్వ్యూకు ఎంపిక
- ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదు
- అర్హత ఉన్నోళ్లను ఎంపిక చేయలేదు
- నిబంధనల ప్రకారమే నియామకాలు : ఘంటా చక్రపాణి
తెలంగాణలో గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గ్రూప్‌-1 నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్‌-1 రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించింది. ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ పద్ధతుల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెయిన్స్‌, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్‌ అభ్యర్థులకు ఉద్యోగాలొస్తాయని 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో నిబంధనలున్నాయి. ఆ నిబంధనలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తిలోదకాలు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను విస్మరించి తక్కువ మార్కుల వచ్చిన వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారన్న అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి.గ్రూప్‌-1 మెయిన్స్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నాగిరెడ్డికి 399.32 మార్కులొచ్చాయి. అదే వరంగల్‌ జిల్లాకు చెందిన సిహెచ్‌ అనిల్‌కుమార్‌ 406.93 మార్కులు సాధించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించడంతో నిజాలు వెల్లడయ్యాయి. మెరిట్‌ను బట్టి చూస్తే నాగిరెడ్డి కంటే అనిల్‌కుమార్‌ 7.61 మార్కులు అధికంగా ఉన్నారు. మార్కులను బట్టి చూస్తే అనిల్‌కుమార్‌ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకు ఎంపిక కావాలి. కానీ 7.61 తక్కువ మార్కులొచ్చిన నాగిరెడ్డిని ఇంటర్వ్యూకు ఎంపిక చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. వాటి ఆధారంగా తనకు జరిగిన అన్యాయంపై టీఎస్‌పీఎస్సీలో ఓ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్న వారిని ఎంపిక చేయలేదని, తక్కువ మార్కులొచ్చిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారని అభ్యర్థి వాపోయారు. ఈ అంశంపై కోర్టుకైనా వెళ్తానని అన్నారు. దీని ఆధారంగా గ్రూప్‌-1 నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియ చేపట్టామని టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ ఘంటా చక్రపాణి నవతెలంగాణతో చెప్పారు.


మార్కులివ్వకపోవడమే పారదర్శకతా?
ఉమ్మడి రాష్ట్రంలో 2011 గ్రూప్‌-1 ప్రిలిమినరీ 
కీలో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు ఏపీ, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని 2016, జూన్‌ 29న ఆదేశించింది. దీంతో 2016, సెప్టెంబర్‌ 14 నుంచి 24వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగాయి. తెలంగాణలో 8,782 మంది అభ్యర్థులు అర్హులు కాగా, 1,792 మంది హాజరయ్యారు. ఆ తర్వాత 2017, జులై 24 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 238 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. 2017, అక్టోబర్‌ 28న 127 గ్రూప్‌-1 పోస్టులకు 121 అభ్యర్థులను ఎంపిక చేసింది. టాప్‌టెన్‌లో 4,9వ ర్యాంకర్లకు ప్రాధాన్యం లేని ఎంపీడీవో పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో టీఎస్‌పీఎస్సీలో తప్పులు దొర్లినట్టు వెల్లడైంది. ఆ వెంటనే గ్రూప్‌-1 ఫలితాలను నిలిపివేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) వల్ల సాంకేతికంగా తప్పులు దొర్లాయని అంగీకరించింది. ఆ తర్వాత ప్రకటించిన ఫలితాల్లో 70 మంది అభ్యర్థుల భవితవ్యం తారుమారైంది. పాత జాబితాలో ఉద్యోగాలు పొందిన పది మంది పేర్లు కొత్త జాబితాలో గల్లంతయ్యాయి. ఇప్పటికీ గ్రూప్‌-1పై అభ్యర్థుల్లో అనుమానాలు తీరలేదు. గ్రూప్‌-1లో 128 పోస్టులకు 122 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాలు వెల్లడించిన తర్వాత అభ్యర్థుల మార్కులను పేపర్లు, ఇంటర్వ్యూ వారీగా విడుదల చేస్తుంది. కానీ టీఎస్‌పీఎస్సీ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని నిత్యం ప్రకటిస్తుంది. కానీ అభ్యర్థులు సాధించిన మార్కులను పేపర్లు, ఇంటర్వ్యూ వారీగా విడుదల చేయకపోవడం పట్ల అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కులు వెల్లడించకపోవడమే పారదర్శకతా?అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రూప్‌-1లో సాధించిన మార్కులు వెల్లడించకపోవడం పట్ల వ్యతిరేకత రావడంతో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు మొత్తం మార్కులను టీఎస్‌పీఎస్సీ ప్రకటించడం గమనార్హం. మెయిన్స్‌ పేపర్లు, ఇంటర్వ్యూ వారీగా మార్కులు విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.


నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 నియామకాలు : ఘంటా చక్రపాణి
నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 నియామకాలు చేపట్టామని టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ ఘంటా చక్రపాణి నవతెలంగాణతో చెప్పారు. నాగిరెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా జోన్‌-5కు చెందుతాడని అన్నారు. అనిల్‌కుమార్‌ వరంగల్‌ జిల్లా జోన్‌-6కు చెందుతారని వివరించారు. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ (ఏఏవో)కు సంబంధించి జోన్‌-5లో ఎక్కువ పోస్టులున్నాయనీ, అందుకే ఆ జోన్‌కు చెందిన నాగిరెడ్డిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశామని చెప్పారు. జోన్‌-6కు చెందిన అనిల్‌కుమార్‌కు మార్కులు ఎక్కువ వచ్చినా జోన్‌-5లో పోస్టులున్నందున ఇంటర్వ్యూకు ఎంపిక చేయలేదని అన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే టీఎస్‌పీఎస్సీ దృష్టికి తేవాలనీ, అయినా పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.
నాకు న్యాయం చేయాలి : అనిల్‌కుమార్‌
రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ తనకు న్యాయం చేయాలని గ్రూప్‌-1 అభ్యర్థి అనిల్‌కుమార్‌ నవతెలంగాణతో చెప్పారు. గ్రూప్‌-1 రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించింది అయినా, ఏఏవో పోస్టు జోన్‌కు చెందుతుందని అన్నారు. మెయిన్స్‌ రాతపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన తనను ఇంటర్వ్యూకు ఎంపిక చేసి మెయిన్స్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ అభ్యర్థిని పోస్టుకు ఎంపిక చేస్తే బాగుండేదని సూచించారు. జోనల్‌ పోస్టుకైనా స్థానికులకు 70 శాతం, స్థానికేతరులకు 30 శాతం పోస్టులుంటాయని చెప్పారు. అలాంటప్పుడు జోన్‌-5కు అయినా తాను అర్హుడినే అవుతానని అన్నారు. మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన తనను ఇంటర్వ్యూకు ఎంపిక చేయకపోవడమే అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఇక్కడ న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. 

Related Posts