YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

'నీరు-చెట్టు'కు అవినీతి చెద

'నీరు-చెట్టు'కు అవినీతి చెద
అభివృద్ధి పనుల్లో అవినీతిని సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వపరంగా ఖర్చు చేసే ప్రతీపైసా ఫలితాన్నివ్వాలని.. అభివృద్ధి పనులు నాణ్యతకు నెలవుగా ఉండాలని అనేకసార్లు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనమాట చెల్లుబాటు కావడంలేదు. ప్రభుత్వం సాగిస్తున్న అనేక పనుల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కర్నూలులోని నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పలువురు పర్సెంటేజీలకు ఆశపడి జేబులు నింపుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారని మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటూ భూగర్భ జలాలను మెరుగుపరచాలన్న ధ్యేయంతో సర్కార్ నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం బాధ్యతలు తీసుకున్న జలవనరుల శాఖకు భారీగానే నిధులు అందిస్తోంది. దీంతో కొందరు సిబ్బంది ఈ విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిధులు దండుకోవచ్చన్న భావనతోనే మరికొందరు రాజకీయ నేతలతో పైరవీలు సైతం చేయించుకుంటూ ఈ పనులకే అంకితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీరు-చెట్టు పనులు జోరుగా సాగుతున్నాయి. పనుల బాధ్యతలు తీసుకున్న కొందరు ఇంజినీర్లు చేతినిండా డబ్బు సంపాదించేందుకు ఉత్సాహం చూపుతున్నారన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. దండుకునేందుకు మంచి ఆస్కారం ఉన్న కార్యక్రమంగా నీరు-చెట్టును భావిస్తూ పనులు జరిగే మైనరు ఇరిగేషన్‌కు ‘డైవర్షన్‌’ పేరుతో ఈ డిపార్ట్‌మెంట్‌లోకి చేరుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. పర్సంటేజీలు, కమీషన్లు బాగా దండుకుంటున్నారని తక్కువ శ్రమతోనే సులభంగా సొమ్ము చేజిక్కించుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు దండుకోవడంపై శ్రద్ధ పెట్టిన అధికారులు నాణ్యతను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు నిర్వహించినవారు పర్సంటేజీలు ఇచ్చినా.. ఎంతోకొంత ముట్టజెప్పినా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. వాస్తవానికి పనులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతకు అనుగుణంగా నిర్మాణాలు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి పక్షపాతం లేకుండా ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి. కానీ కొందరు అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి మామూళ్లు తీసుకుంటూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమాలకు అడ్డుకట్టవేయాలని అంతా కోరుతున్నారు. కీలకమైన నీరు-చెట్టు పనులు నాణ్యతకు తగ్గట్లుగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts