విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ
ప్రాంతాల నుండి వచ్చిన డప్పు కళాకారులతో కొండపైన ప్రదర్శనతో అమ్మకు నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ, నగర పోలీస్ కమీషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు దంపతులు పాల్గోన్నారు. తెల్లవారుజాము నుండే క్యూ మార్గాల్లో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి వున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 9 గంటలకు స్వర్ణ కవచాలంకృత దేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లను మీడియాకు ఈవో కోటెశ్వరమ్మ వివరించారు. భక్తులు ఉత్సవాల సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 4259099, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నెంబర్ 7328909090 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం దుర్గ ఘాట్ వద్ద ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కృష్ణవేణి ఘాట్ సమీపంలో కేశఖండన శాల, ఆర్టీసీ బస్టాండ్, కృష్ణవేణిఘాట్ల వద్ద భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వినాయక ఆలయం నుంచి క్యూ లైన్లు ప్రారంభమవుతాయని, రథం సెంటర్ వద్ద క్యూలైన్ల పక్కనే బ్యాగులు, చెప్పులు భద్ర పరుచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. అలాగే అర్జునవీధి చివరిలో ప్రసాద కేంద్రాలు, అన్నదానం ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా అప్పం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లికార్జున మహా మండపంలో కుంకుమార్చన, యాగశాలలో చండీహోమానికి ఏర్పాట్లు చేశారు.