వైకాపా ఐదు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఎందుకు రాలేదో జగన్ చెప్పాలి. ఏపిలో వైసిపి ఎంపిలు రాజీనామా చేసిన 5లోక్ సభ స్థానాలకు ఉపఎన్నికలు రాలేదని అర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.బిజెపి, వైసిపి లాలూచీపై యనమల ధ్వజం ఎత్తారు. వీళ్లకన్నా నెలా 10రోజులు వెనుక రాజీనామా చేసిన 3స్థానాలకు కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ ఏపిలో వైకాపా 5 స్థానాలకు ఉపఎన్నికలు రాలేదంటేనే అందులో కుమ్మక్కు బైటపడిందని అన్నారు. వైకాపా స్థానాలకు ఉపఎన్నికలు రాకపోవడంపై జగన్ ఎందుకు నోరు తెరవరు..? ఉప ఎన్నికలు రాకుండా, వాటి ఆమోదంలో తాత్సారానికి బాధ్యత ఎవరిది..?స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి 52రోజులు తాత్సారం అయ్యేలా చేసిందెవరని ప్రశ్నలు కురిపించారు. నరేంద్రమోది, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కు వల్లే ఉపఎన్నికలు రాలేదనే వాస్తవం వెల్లడైంది. ఈ కుట్రను అప్పుడే తెలుగుదేశం పార్టీ బైటపెట్టింది, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ప్రకటన దానిని రుజువు చేసింది. ఓడిపోతామనే భయంతోనే ఉపఎన్నికలు రాకుండా చేశారు. ఏడాది గడువుకు ఒకరోజు తగ్గేలా చూసి ఆమోదించేలా ఒత్తిడి తెచ్చారు. 5ఎంపి సీట్లలో ఉపఎన్నికలు జరిగితే తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందనే భయంతోనే రాకుండా కుట్ర పన్నారు. రాజకీయ కుట్రలే కాదు,ఆర్ధిక పరమైన కుట్రలు కూడా చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో బిజెపి నేతలు ఆంధ్రప్రదేశ్ పై రాజకీయ కుట్రలే కాదు, ఆర్ధిక పరమైన కుట్రలు కూడా చేస్తున్నారు. అన్ని హక్కులు ఉన్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ తోసిరాజని తీవ్ర అన్యాయానికి తెగబడ్డారని అయన అన్నారు.
వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్లు ఇంతవరకు వెనక్కి ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు రూ.450కోట్లు విడుదల చేసి, ఏపిలో 7జిల్లాలకు అన్యాయం చేయడాన్ని ఏమనాలి..? రెండు రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాలకు సాయం చేయాలని ఒకే చట్టం చెప్పింది. ఏపికి ఇచ్చినది వెనక్కి తీసుకున్నారు. తెలంగాణకు మాత్రం ఎదురెదురు చేస్తున్నారు. ఇది చట్టరీత్యా సంక్రమించిన ఆర్ధిక సాయం. దీనిని ఆపేహక్కు గాని, వెనక్కి తీసుకునే హక్కుగాని కేంద్రానికి లేదు. చట్టాలను కాలరాసేలా కేంద్రంలోని బిజెపి నేతలు వ్యవహరించడం గర్హనీయం. చట్టానికి తూట్లు పొడిచేలా కేంద్రంలోని బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు. డివల్యూషన్ దరిమిలా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు రెండువిధాలుగా అందుతాయని అన్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు ఆటోమేటిక్ గా వచ్చేవి, 2. కేంద్రానికి ఉన్న విచక్షణాధికారం ప్రకారం వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులని అన్నారు. నిధుల మంజూరులో కేంద్రానికి విచక్షణాధికారం ఉండకూడదు. దీనివల్ల చాలా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. బిజేపియేతర రాష్ట్రాలను అణిచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి న్యాయం చేయాలని 14వ ఆర్ధిక సంఘాన్ని కూడా కోరాం. కానీ మనకు ఒనగూడిన ప్రయోజనం శూన్యమని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం క్రైటీరియా కేంద్రం ముందే నిర్ణయించడం అన్యాయం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం,రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్(టివోఆర్) మార్చుకోవాలి. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు అనేక సమావేశాలు జరిపి వీటిని మార్చాలని కోరాం. ఆర్దిక మంత్రులు అందరూ కలిసి రాష్ట్రపతిని కలిసి టివోఆర్ మార్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. రెవిన్యూ లోటుతో విభజించబడిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా చూసి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. 14వ ఆర్ధిక సంఘం అంచనాలు ఏవిధంగా వాస్తవ వ్యతిరేకంగా ఉన్నాయో అనుభవంలో చూశాం. దానిని దృష్టిలో వుంచుకుని 15వ ఆర్ధిక సంఘం వాస్తవిక దృక్ఫథంలో అధిక నిధులు ఏపికి మంజూరు చేయాలి. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, విభజన వల్ల నష్టపోయిన ఏపికి న్యాయం చేయాలని అన్నారు.