సినిమా రంగంలో తెరవెనుక బాగోతాలు ‘మీటూ’ ఉద్యమం ద్వారా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ సంచలనంగా మారింది. మొన్న బాలీవుడ్‌లో తనూ శ్రీ దత్తా మీటూ ఉద్యమ ప్రేరణతో నానా పటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేయగా.. తాజాగా దక్షిణాది దిగ్గజ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపులు ప్రకంపనలు రేపాయి. ఇక వైరముత్తు బాధితుల్లో తన స్నేహితురాలు కూడా ఉందని, ఆమె ఈ విషయం చెప్పినప్పుడు తనకు వణుకు పుట్టిందంటూ సింగర్ చిన్మయి ట్వీట్ చేస్తూ.. వైరముత్తు బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఆమెతో పాటు మరికొంత మంది మీటు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత ఈ మీటూ ఉద్యమంపై స్పందించారు. మీటూ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్ చేశారు సమంత. ‘మీటూ మూమెంట్‌లో భాగమవుతూ ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురైన వేధింపులను వ్యక్తపరుస్తున్న మహిళలకు నా మద్దతు ఇస్తున్నా. మీ వాయిస్‌తో ఎంతో మంది అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని కాపాడుతున్నారు. చాలా థాంక్స్. కొంతమంది ఈ ఉద్యమంలో ఉన్న వారిపట్ల నెగిటివ్‌గా మాట్లాడటం వాళ్లను వ్యతిరేకిండచం దారుణం. అంతేకాకుండా తమపై వేధింపులు జరిగాయని ముందుకు వచ్చిన వారిని ఆధారాలు ఉన్నాయా? అంటూ కొంత మంది ప్రశ్నించడం బాధాకరం. వేధింపులకు సాక్ష్యాలు కావాలా? ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి సారీ’ అన్నారు.