- బాషా పండిత పోస్టుల దరఖాస్తుకు వెసులుబాటు
- ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఈ ఆప్షన్
- టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్
ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నఅభ్యర్థులకు నష్టం జరుగకుండా టీఎస్‌పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. పాత జిల్లాల ప్రకారం, కొలువులు ఉన్న మాధ్యమాల ప్రకారం దరఖాస్తులు సమర్పించుకోనివారికి.. వీటిని సవరించుకొనేందుకు వీలుగా మరోసారి ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చింది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. అయితే ఆ మాధ్యమాల్లో ఖాళీలులేవని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు.
అందుకే తెలుగు, ఉర్దూ, మరాఠి, కన్నడలో ఉన్న కొలువుల కోసం పోటీ పడేందుకు తమ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తిచేసుకోకపోతే వారు దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోలేరని పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంటుందని చెప్పారు. ఎడిట్ అవకాశం కల్పించినప్పటికీ 30,849 మంది అభ్యర్థులు పాత పది జిల్లాల ప్రకారం తమ దరఖాస్తులు సమర్పించలేదని వివరించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొనే సమయంలో వారు తమ జిల్లాల వివరాలను సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు.