వైసిపిలో ముందస్తు టిక్కెట్ల సందడి పెరిగింది.రానున్న ఎన్నికలు వైసిపికి చావో...రేవోగా మారాయి.ఎన్నికల్లో అధికార టిడిపి ఎదుర్కొవాలంటే ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారిని ఎంపిక చేయడం తప్ప మరో మార్గం లేదని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అసెంబ్లీకి సంబంధించి 'డబ్బున్న' బిసి అభ్యర్థులను రంగంలోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారిని ఎంపిక చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు కొన్ని నెలల ముందే సమన్వయకర్తల మార్పు పేరుతో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు క్యాడర్‌లోనూ కొంత అయోమయానికి దారితీస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు చేసి టిడిపికి దీటుగా అభ్యర్థులను నిలపాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉంది. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యను నియమించారు. ఇప్పటి వరకూ ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును నర్సరావుపేటకు మార్చారు. దీనిపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. నర్సరావుపేటలో ఇతర సామాజిక తరగతులకు అవకాశం ఇస్తే పార్టీకి ఎంతో కొంత కొత్త ఓటు బ్యాంకు ఏర్పడుతుందని భావించామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు చెప్పారు. చిలకలూరిపేటలో మంత్రి పత్తిపాటి పుల్లారావును ఢకొీనేందుకు ఆర్థికంగా మర్రి రాజశేఖర్ సరితూగలేరని నిర్థారించుకున్న అధిష్టానం వెనుకబడిన తరగతులకు చెందిన, ఎన్‌ఆర్‌ఐ అయిన విడదల రజనీని ఎంపిక చేసింది. ఆమె కుటుంబంలో అమెరికాలో ఉన్న కాలంలో బాగా సంపాదించడంతో రాజకీయ రంగంపై దృష్టి సారించారు. చిలకలూరిపేటలో పోటీ చేసేందుకు, మంత్రి ఢకొీనేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు జగన్‌ను కలిశారు. వెంటనే ఆమెకు చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమించారు. రజనీ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మర్రి రాజశేఖర్ గ్రూపు రెండ్రోజులు నిరసన తెలిపినా వైసిపి అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇవ్వడంతో రాజశేఖర్ సర్దుకున్నట్లు పార్టీలో ప్రచారం అవుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డికి నియోజకవర్గంలో కొన్ని లోపాలున్నట్లు వైసిపి సర్వేలో తేలడంతో ఈ నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ డిఐజి సిహెచ్.ఏసురత్నంను నియమించారు. ఏసురత్నం ఎంపికపై అప్పిరెడ్డి ఒక రోజు నిరసన తెలిపినా ఆయనకు జగన్ గట్టి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు చేయనున్నారు. నాలుగేళ్లు పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా సొంతంగా ఉద్యమాలు చేసిన నియోజకవర్గ సమన్వయకర్తలు చాలా తక్కువని చెబుతున్నారు. ఆర్థికంగా ప్రత్యర్థులతో తలతూగలేని వారికి పార్టీ అధిష్టానం నుంచి సాయమేమీ చేయలేమని ముందే సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. మనం అధికారంలోకి వస్తే మీసేవలకు మరో రూపంలో 'న్యాయం' చేస్తామని అందరికీ భరోసా ఇచ్చి మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా వైసిపిలో పరిణామాలను టిడిపి నిశితంగా గమనిస్తోంది. వైసిపిలో అసమ్మతి నాయకులకు గాలం వేసే పనిలో కొంత మంది టిడిపి నేతలు నిమగమైనట్లు సమాచారం.