రాష్ట్రంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ప్రమాదకర జ్వరాలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్యం తలకు మించిన భారం అవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యం అందక వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వారు వేలు, లక్షల్లో బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద రోగుల పరిస్థితి ఇలానే ఉంది. పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షల బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ నిర్లక్ష్యం ప్రైవేట్ ఆస్పత్రులకు వరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి మూడు ఇళ్లకు ఒక ఇంటిలో జ్వర పీడితులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.పేదలకు అందుబాటులో ఉండాల్సిన పీహెచ్‌సీల్లో కనీస వైద్య పరీక్షలు సకాలంలో చేయకపోవడం, డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి. సాధారణ వైరల్ జ్వరమొచ్చినా విధిలేని పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. రకరకాల పరీక్షలతో ప్రైవేటు ఆస్పత్రులు పేదల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. మూడు రోజుల్లో తగ్గిపోయే సాధారణ జ్వరానికి కూడా మూడు వేల రూపాయల పైనే గుంజుతున్నారు. గడిచిన రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల నుంచి 60 లక్షల మందికిపైనే వైరల్ జ్వరాల బారిన పడినట్టు ప్రభుత్వ అంచనా. వీరిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. సీజన్ మారినప్పుడు వచ్చే ఈ జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ కేంద్రాలకు మనీ సీజన్‌గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,157 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి తాజా సీజనల్ వ్యాధుల దృష్ట్యా రోజూ 80 నుంచి వంద మంది రోగులు వస్తున్నారు. కానీ కొన్ని వైద్య పరీక్షలు ఇక్కడ జరగకపోవడం, మధ్యాహ్నం 2 గంటల తర్వాత డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక రెండు వందలకుపైగా పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేకపోవడం కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు కలసివస్తోంది. పీహెచ్‌సీల్లోని వైద్య పరీక్షల్లో డెంగీకి సంబంధించి రాపిడ్ టెస్ట్‌కిట్‌ను మెడాల్ సంస్థకు అప్పగించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ టెస్టు పీహెచ్‌సీలోనే చేయాలి. రక్త నమూనా తీసుకున్న అరగంటలో రిపోర్టు ఇవ్వాలి. కానీ మెడాల్ సంస్థ పీహెచ్‌సీలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేయకపోవడంతో రక్తనమూనాలను వేరే చోటకు తీసుకెళ్లి రెండుమూడు రోజుల తర్వాత రిపోర్టు ఇస్తున్నారు. బాధితుడికి జ్వర తీవ్రత పెరిగితే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఇలా ప్రధానమైన 7 రకాల పరీక్షలు మెడాల్ సంస్థకు ఇవ్వడం, ఆ సంస్థ మూడు రోజులకు గానీ రిపోర్టులు ఇవ్వకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు గర్భిణుల విషయంలో అరగంటలో రిపోర్టు ఇవ్వగలిగే ఆర్‌పీఆర్ టెస్ట్‌కు కూడా ఆ ప్రైవేట్ సంస్థ మూడు రోజుల తర్వాత రిపోర్టు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పోసొప్పో చేసైనా ప్రాణాలు నిలబెట్టుకోవాలని పేదలు కూడా ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు.