మార్కెట్‌లో ఏ వస్తువు కొని తీసుకువెళ్లాలన్నా పాలిథీన్ కవరే శరణ్యం. మనిషి జీవితంలో నిత్యావసర వస్తువుగా ప్లాస్టిక్ కవరు మారిపోయింది. కవర్ల వాడకం వలనే పర్యావరణానికి హానికరమే కాకుండా మూగజీవాలకు ప్రాణ సంకటంగా మారింది. ప్లాస్టిక్, పాలిథీన్ కవర్ల వాడకం నిషేధించినా పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. ఎక్కడా నిబంధనలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు. అధికారులు మాత్రం గుర్తుకు వచ్చినప్పుడు దాడులు చేసి మమ అనిపిస్తున్నారు. కనీసం అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది లేదు. జిల్లా యంత్రాంగం ఆ దిశగా ఆలోచన చేసి నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉంది.స్పీడ్‌యుగంలో కనీసం వీటిని పట్టించుకునే పరిస్థితులు లేవు. పాలిథీన్ సంచులను నిషేధించామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడంలేదు. వాటివల్ల కలుగుతున్న అనర్థాలు దీర్ఘకాలం పాటు వేధిస్తున్నాయి.ఇంట్లోని చెత్తాచెదారమంతా పోగేసి ప్లాస్టిక్ కవరులో ఉంచి బయటపారేస్తాం. మనం తెలిసి చేసినా, తెలియక చేసినా ఈ చిన్న పొరపాటు మూగజీవాల పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. రోడ్డుపై పారవేసిన ప్లాస్టిక్ కవర్లను తిన్న పశువులు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు వినియోగించుకున్నాక నిర్లక్ష్యంగా వాటిని రోడ్లపై విసిరేస్తుంటారు. అవి కాస్తా కాలువలు, డ్రెయినేజీల్లోకి చేరి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. మురుగు పారకుండా అడ్డుపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు రోడ్లపైకి చేరడానికి, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడానికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. కవర్ల వినియోగం అనంతరం జనసంచారం లేని ప్రాంతంలో వాటిని కాల్చి వేస్తే మంచిది. పాలిథీన్ కవర్ల వినియోగం వలన మూగజీవాలకే కాదు మనుషులకు కూడా ప్రాణాపాయం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కవర్లల్లో పండ్లు, కూరగాయలతో పాటు వేడివేడి టీ, కర్రీలు తీసుకువెళ్ళటం ఆరోగ్యానికి హానికరమని పర్యావరణవేత్తలు తేల్చిచెప్పారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితం, బట్ట, నార సంచులను వినియోగిస్తే పర్యావరణంతో పాటు ప్రజలను కాపాడవచ్చు. ప్లాస్టిక్ కవర్ల వల్ల జరిగే అనర్థాలను అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఫలితంగా కొందరిలోనైనా మార్పు తేవచ్చు. సరుకుల దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం వలన కాగితం సంచులకు ప్రాధాన్యత కలుగుతుంది.